ఢిల్లీ డాబాలో ఐస్మార్ట్ బ్యూటీస్

Wed Jun 12 2019 09:37:31 GMT+0530 (IST)

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ వచ్చే నెల విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఫస్ట్ ఆడియో సింగల్ దిమాక్ ఖరాబ్ ఇప్పటికే ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. అర మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. స్పెషల్ ఐటెం సాంగ్ గా రూపొందిన ఈ పాట గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు హీరోయిన్లు నిధి అగర్వాల్-నభ నటేష్ లు.సాధారణంగా ఐటెం సాంగ్స్ లో వేరే ఆర్టిస్ట్ నటించడం సహజం. కానీ ఐస్మార్ట్ శంకర్ ది ఇందులోనూ ప్రత్యేకమైన శైలి. అసలు హీరోయిన్లనే ఐటెం సాంగుకూ వాడుకున్నాడు. ఢిల్లీ డాబా తరహాలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జానీ మాస్టర్ నేతృత్వంలో ఫుల్ ఊర మాస్ స్టెప్స్ తో దీన్ని షూట్ చేశారు పూరి. దీని విశేషాలు చెబుతూ పాట తీస్తునన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశామని కాసర్ల శ్యామ్ లిరిక్స్ అర్థం కాకపోయినా వాటిలో రైమింగ్ చాలా బాగుందని నిధి చెప్పగా ఏకంగా పాడి వినిపించి నభ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

నిర్మాతల్లో ఒకరైన చార్మీ ఫ్రెండ్ లా కలిసిపోవడం ఆశ్చర్యపరిచిందని ప్రొడ్యూసర్ అనే దర్పం లేకపోవడం చూసి షాక్ ఇచ్చిందని చెప్పారు. జానీ మాస్టర్ తమ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు స్టెప్స్ వేయించడం ఒక ఎత్తు అయితే ఎనర్జీకి మారుపేరైన రామ్ కు జోడిగా డాన్స్ చేయడం అసలు కిక్ ఇచ్చిందని చెప్పుకోవడం విశేషం. మొత్తానికి ఐస్మార్ట్ శంకర్ లో ఈ దిమాక్ ఖరాబ్ పాట ఏ స్థాయిలో పేలబోతోందో వీళ్ళ మాటలను బట్టే అర్థమవుతోంది. పూరి మేకింగ్ స్టైల్ కి ఫిదా అయిపోయిన ఈ ఇద్దరు భామలు ఐస్మార్ట్ శంకర్ కెరీర్లోనే పెద్ద బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు.