మహేష్.. రజనీ.. ఇప్పుడు కమల్

Fri Aug 10 2018 18:42:45 GMT+0530 (IST)

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్లలో ఎన్వీ ప్రసాద్ ఒకరు. ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్లలో వచ్చిన సినిమాలన్నింటికీ ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉండేవాళ్లు. తరచుగా సినిమాలు నిర్మించేవాళ్లు. కానీ ఆ బేనర్ ప్రభ కోల్పోయాక ఆయన జోరు తగ్గింది. అప్పట్నుంచి సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ కే పరిమితం అయ్యారు. రాయలసీమలో ఆయన్ని మించిన డిస్ట్రిబ్యూటర్ లేడు. ప్రతి పెద్ద సినిమానూ ఆయన పంపిణీ చేస్తుంటారు. ఐతే ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్ లోనూ ఆయన జోరు తగ్గుతోంది. వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. చాన్నాళ్ల తర్వాత ఆయన ప్రొడక్షన్లోకి దిగి.. ‘స్పైడర్’ సినిమాను నిర్మించారు. ఠాగూర్ మధుతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఏకంగా రూ.120 కోట్లు పెట్టి తీసిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో తెలిసిందే.ముందు బిజినెస్ బాగానే జరిగినా.. రిలీజ్ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్లు  చేసే సరికి నష్టాలు తప్పలేదు. దీంతో కొంచెం గ్యాప్ ఇచ్చిన ప్రసాద్.. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘కాలా’ను పంపిణీ చేశారు. ఆ చిత్రం దారుణ ఫలితాన్నందుకుంది. అడ్వాన్స్ పద్ధతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన ప్రసాద్ కు పైసా మిగల్లేదు. డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల ఖర్చులే మిగిలాయి. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ ఒక తమిళ సినిమాను రిలీజ్ చేశారాయన. అదే.. విశ్వరూపం-2. చాలా తక్కువ రేటుకే సినిమాను కొన్నప్పటికీ ఈ చిత్రానికి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే పెట్టుబడి వెనక్కి రావడం కష్టమే అనిపిస్తోంది. ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మొత్తానికి ఇటు టాలీవుడ్లో.. అటు కోలీవుడ్లో బడా స్టార్లను నమ్ముకున్న ప్రసాద్‌కు చేదు అనుభవాలే మిగిలాయి. ఆయన్ని మళ్లీ పైకి లేపే సినిమా ఏదవుతుందో చూడాలి.