Begin typing your search above and press return to search.

‘ఎన్టీఆర్’ గురించి ఎన్టీఆర్ ను అడిగితే..

By:  Tupaki Desk   |   14 July 2018 5:47 AM GMT
‘ఎన్టీఆర్’ గురించి ఎన్టీఆర్ ను అడిగితే..
X
సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహాలు మొదలైనప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి కళ్యాణ్ రామ్ మీడియాకు దొరికితే చాలు.. మీరు ఆ సినిమాలో నటిస్తున్నారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాళ్లిద్దరూ ఒకే సమాధానాన్ని రిపీట్ చేస్తున్నప్పటికీ మీడియా వాళ్లు వారిని వదలట్లేదు. తాజాగా ఓ మొబైల్ సంస్థ ప్రచారకర్తగా నియమితుడైన సందర్భంగా ఎన్టీఆర్ మీడియాను కలిస్తే.. ఒక రిపోర్టర్ మళ్లీ ‘ఎన్టీఆర్’ సినిమా గురించే ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్ ఒకింత అసహనంతో.. తెలివిగా బదులిచ్చాడు. ఈ ప్రశ్నకు తాను ఇంతకుముందు ఐపీఎల్ ప్రచారకర్తగా నియమితుడైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పానని.. ఎప్పుడూ తన సమాధానం అదేనని.. మళ్లీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోనని.. ఎప్పటికైనా తన జవాబు అదేనని.. కావాలంటే ఒకసారి ఆ వీడియోలు చూసుకుని జవాబు తెలుసుకోవాలని చెప్పడం విశేషం.

మరోవైపు మొబైల్ వినియోగంలో తన అనుభవాల గురించి ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్లో ఆసక్తికర విషయాలు చెప్పాడు. తాను తన తొలి మొబైల్.. హైదరాబాద్ అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్లో కొన్నానని.. అప్పుడు అందులో చాలా గేమ్స్ ఆడానని చెప్పాడు. తనకు మొబైల్ పిచ్చి ఉందని.. ఒక మూడు నెలల పాటు గాడ్జెట్లకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పాడు. తాను.. తన భార్య కలిసి తరచుగా మొబైల్ తో ఫొటోలు దిగుతుంటామని చెప్పాడు. తనతో పోలిస్తే తన కొడుకు మొబైల్ వాడకంలో యాక్టివ్ అని ఎన్టీఆర్ చెప్పాడు. మరోవైపు ‘బిగ్ బాస్’ రెండో సీజన్లో హోస్ట్ గా నాని పెర్ఫామెన్స్ గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడాడు. నాని మంచి నటుడని.. ‘బిగ్ బాస్’లో కూడా అతను బాగా చేస్తున్నాడని అన్నాడు. ప్రతివారం నాని చెబుతున్న కాకమ్మ కథలు బాగున్నాయని ఎన్టీఆర్ అన్నాడు. ‘బిగ్ బాస్’ అనేది తిరుగులేని ప్లాట్ ఫామ్ అని.. ఎవరు చేసినా అది బాగానే ఉంటుందని తారక్ చెప్పాడు.