Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రెండు రోజులుండగానే...

By:  Tupaki Desk   |   26 May 2016 11:31 AM GMT
ఎన్టీఆర్ రెండు రోజులుండగానే...
X
మే 28.. నందమూరి కుటుంబానికి.. అభిమానులకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు నందమూరి తారకరామారావు జయంతి. నందమూరి కుటుంబంలోని వాళ్లే కాదు.. కోట్లాది మంది తెలుగువాళ్లు ఆ రోజు ఎన్టీఆర్ ను తలుచుకుంటారు. నివాళి అర్పిస్తారు. నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ఆ రోజు హుస్సేన్ సాగర్ దగ్గర్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చూడొచ్చు. ఆ రోజు కచ్చితంగా అందరూ అక్కడికొచ్చి పెద్దాయనకు నివాళి అర్పిస్తారు.

ఐతే ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ రెండు రోజుల ముందే ఎన్టీఆర్ ఘాట్ కు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ దర్శకుడు కొరటాల శివతో కలిసి ఈ ఉదయం జూనియర్.. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చాడు. వీళ్లిద్దరూ ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చాలా ఉద్వేగంగా కనిపించాడు.

ఎన్టీఆర్ ఇలా రెండు రోజుల ముందే ఘాట్ కు ఎందుకొచ్చాడన్నది అర్థం కాని విషయం. ఆ రోజు షూటింగ్ కోసం ఔట్ డోర్ వెళ్తున్నాడా..? మామూలుగా అయితే తన షెడ్యూళ్లను ఎన్టీఆర్ ఎప్పుడూ అలా ప్లాన్ చేసుకోడు. తాత జయంతి రోజు కచ్చితంగా హైదరాబాద్ లోనే ఉంటూ ఉంటాడు. బహుశా ఆ రోజు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చే వందల మందిలో ఒకడిగా ఉండటం ఇష్టం లేక రెండు రోజుల ముందే ఇలా ప్రత్యేకంగా వెళ్లి నివాళి అర్పించి వచ్చాడేమో. ఎన్టీఆర్ జయంతి రోజు ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ టీజర్ ను అభిమానులకు కానుకగా అందిస్తాడని ప్రచారం జరిగింది కానీ.. ప్రస్తుతానికి ఆ సంకేతాలేమీ కనిపించడం లేదు.