ఆ లెక్కన ఈసారి ఎన్టీఆర్ కు హిట్టేనా?

Wed Feb 14 2018 23:00:01 GMT+0530 (IST)

హిట్టు కొట్టిన డైరెక్టర్ల వెంటపడతాడంటూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక చెడ్డ పేరుండేది. ‘కిక్’ తర్వాత సురేందర్ రెడ్డితో.. ‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్లతో.. ‘కందిరీగ’ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో సినిమాలు చేశాడతను. కానీ అతను ఆశించిన ఫలితాలు ఎదురవ్వలేదు. కానీ ఎప్పుడైతే పూరి జగన్నాథ్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేశాడో అప్పుడే ఎన్టీఆర్ దశ తిరిగింది.‘హార్ట్ అటాక్’ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ మంచి విజయం సాధించింది. అక్కడి నుంచి ఎన్టీఆర్ విన్నింగ్ స్ట్రీక్ కొనసాగుతోంది. ఆ తర్వాత ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ తీసిన సుకుమార్ దర్శకత్వంలో తారక్ ‘నాన్నకు ప్రేమతో’లో నటించాడు. అది హిట్టయింది. ఆపై ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి డిజాస్టర్ చేసిన బాబీకి అవకాశమిచ్చాడు తారక్.

‘జై లవకుశ’ బయ్యర్లకు స్వల్పంగా నష్టాలు తెచ్చిపెట్టిన విషయం నిజమే కానీ.. నిర్మాత కళ్యాణ్ రామ్‌కు మాత్రం భారీగానే లాభాలందించింది. తారక్ కు నటుడిగా మంచి పేరొచ్చింది. ఈ సినిమాకు లాభాల వాటా రూపంలో తన కెరీర్లోనే అత్యధిక పారితోషకం అందుకున్నడు తారక్. ఇలా గత కొన్నేళ్లలో ఫ్లాప్ డైరెక్టర్లతో జత కట్టి మంచి ఫలితాలందుకున్నాడు తారక్.

ఇప్పుడతను ‘అజ్ఞాతవాసి’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జత కట్టబోతున్నాడు. ‘అజ్ఞాతవాసి’ ఫలితం చూసి భయపడాల్సిన పని లేదని.. సెంటిమెంటు కొనసాగి ఎన్టీఆర్ కు అతను హిట్టే ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా హల్ చల్ చేస్తుండటం విశేషం. మరి నిజంగానే తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మంచి హిట్టొస్తుందేమో చూద్దాం.