వచ్చింది..చూసింది..అక్రమించింది..వెళ్లిపోయింది

Sun Feb 25 2018 10:23:48 GMT+0530 (IST)

ఈ ఆదివారం లేచినంతనే కోట్లాది మందికి ఎలాంటి షాక్ తగిలిందో.. చిత్రపరిశ్రమకు అంతకు మించిన షాక్ కు గురైంది. అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త జీర్ణించుకోలేనిదిగా మారింది. లాగి పెట్టి కొడితే ఎలాంటి నొప్పి కలుగుతుందో.. శ్రీదేవి మరణవార్త అంతకు రెట్టింపు నొప్పికి గురి చేస్తోంది.నమ్మలేనట్లుగా మారిన ఆమె మరణవార్తను.. కళ్లు నులుముకొని మరీ నిజ్జంగానా అంటూ అడిగేస్తున్న పరిస్థితి. శ్రీదేవి మరణవార్తకు సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు. శ్రీదేవిని విపరీతంగా అభిమానించి.. ఆరాధించే టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు.  అతిలోక సుందరిపై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించే ఎన్టీఆర్.. శ్రీదేవి మరణంపై రియాక్ట్ అయ్యారు. శ్రీదేవితో కలిసి నటించేందుకు తానెప్పుడూ సిద్ధమని చెప్పే ఎన్టీఆర్ అతిలోక సుందరి మరణంపై ట్వీట్ చేశారు.

"తాను ఏ స్వర్గం నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లిపోయిందన్నారు. ఆమె వచ్చింది.. ఆమె చూసింది.. ఆమె ఆక్రమించింది". అంటూ ట్వీట్ చేసిన ఎన్టీఆర్.. ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

శ్రీదేవి మరణవార్త విన్నంతనే కొందరు సినీ ప్రముఖులు స్పందించగా.. మిగిలిన వారంతా ఉదయం ఏడు గంటల నుంచి ట్వీట్లు చేయటం షురూ చేశారు.  హీరోయిన్ హన్సిక రియాక్ట్ అవుతూ.. తాను నమ్మలేకపోతున్నానని.. ఆమె మరణం నిజం కాకూడదని.. ఇంకా షాకింగ్ లోనే ఉన్నా.. భారతీయ సినీ చరిత్రలో ఇదో చీకటిరోజు.. ఆమె లేని లోటును చెప్పేందుకు మాటలు సరిపోవటం లేదని పేర్కొన్నారు.

ఆమె లేదంటే నమ్మలేకపోతున్నా.. అందం అంటే ఎప్పటికి శ్రీదేవిగారే.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని హీరో నిఖిల్ ట్వీట్ చేస్తే.. పలువురు సినీ ప్రముఖులు శ్రీదేవి మరణం మీద ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.