Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్‌' లో బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్‌..?

By:  Tupaki Desk   |   21 Oct 2018 11:52 AM GMT
ఎన్టీఆర్‌ లో బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్‌..?
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం దసరా కానుకగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ ను నేడు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సక్సెస్‌ వేడుకలో ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ పాల్గొనబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ వేడుకపై ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్‌ మరియు బాలకృష్ణ లు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరి మద్య విభేదాలంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా హరికృష్ణ మరణంతో బాలకృష్ణ మరియు ఎన్టీఆర్‌ ల మద్య విభేదాలు పక్కకు పెట్టేశారు.

హరికృష్ణ మరణంతో కలిసిన వీరిద్దరు అభిమానుల కోసం, కుటుంబం కోసం కలిసే ఉండాలని భావిస్తున్నట్లుగా తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనిపిస్తుందంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అరవింద సమేత సక్సెస్‌ మీట్‌ కు బాలయ్య వస్తున్న ఈ సమయంలోనే మరో ఆసక్తికర పుకారు సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ ను క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్‌ పోషిస్తున్నాడు. ఇక బాలకృష్ణ పాత్రను ఎన్టీఆర్‌ తో చేయించేందుకు సిద్దం అవుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొన్నటి వరకు ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ లో బాలయ్య పాత్రను ఆయన తనయుడు మోక్షజ్ఞ చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. అయితే హరికృష్ణ మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో బాలయ్య పాత్రను ఎన్టీఆర్‌ చేస్తేనే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఒక వేళ ఈ బయోపిక్‌ లో ఉంటే సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం అని, అందుకే ఎన్టీఆర్‌ ను బాలయ్య పాత్రకు తీసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇదే కనుక నిజం అయితే నేడు అరవింద సమేత చిత్రం సక్సెస్‌ వేడుకలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు, పోస్టర్‌ ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజం అవ్వాలని నందమూరి అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

ఇప్పుడు ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కోసం ఎన్టీఆర్‌ ను వాడుతున్న బాలయ్య ఆ తర్వాత ఎన్నికల్లో ప్రచారానికి కూడా వాడుతాడేమో అంటూ అప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.