బయోపిక్ పై ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక కారణం..?

Fri Jan 11 2019 16:53:35 GMT+0530 (IST)

ఎన్టీఆర్ కథానాయకుడు రెండు రోజులు క్రితం విడుదలైంది. సినిమా ఇండస్ట్రీ నుంచే కాకుండా.. వివిధ వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాను పొగిడేస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో తెలీని విషయాల్ని చాలా అద్భుతంగా చూపించాలని అంటున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ కూడా బయోపిక్ బాగుందని ప్రశంసలు కురిపించాడు. అందరూ అద్భుతం అంటున్న బయోపిక్ పై ఇప్పటివరకు ఒకే ఒక్క వ్యక్తి మాత్రం స్పందించలేదు. అతడే ఎన్టీఆర్.ఎన్టీఆర్ కు బాలయ్యకు సరిగ్గా పడదనే విషయం అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ తో మొన్నటివరకు అంటీముట్టనట్లుగా ఉన్న బాలయ్య.. హరికృష్ణ మరణం తర్వాత దగ్గరయ్యారు. ఇక అబ్బాయ్ - బాబాయ్ ఇద్దరూ ఆడియో ఫంక్షన్ లో కన్పించారు. దీంతో.. ఇంకేముంది అంతా కలిసిపోయారు అని అనుకుంటున్న టైమ్ లో.. బయోపిక్ గురించి తారక్ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బయటివాళ్లే సినిమాను అద్భుతం అని పొగుడుతున్న వేళ.. ఇంటివాడైన ఎన్టీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ గురించి - బాలయ్య సినిమా తీయడంపై ఎన్టీఆర్ అంత ఇష్టంగా లేడని.. అందుకే ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఉండిపోయాడని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం తారక్ ఇంకా సినిమా చూడలేదని.. చూసిన తర్వాత కచ్చితంగా రెస్పాన్స్ ఉంటుందని చెప్తున్నారు.