కన్నడ సినిమా నుంచి ఫిలిం ఫేర్ కు ఎన్టీఆర్

Thu May 18 2017 15:47:09 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఇప్పటికే బోలెడన్ని అవార్డులు అందుకున్నాడు. ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఏడుసార్లు ఉత్తమ నటుడిగా నామినేషన్లు తెచ్చుకుని.. సింహాద్రి.. యమదొంగ సినిమాలకు రెండు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఐతే ఈ ఏడాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఎన్టీఆర్ కు కొత్త రకమైన నామినేషన్ దక్కింది. అతను ఉత్తమ డెబ్యూ సింగర్ నామినేషన్ తెచ్చుకోవడం విశేషం. ఐతే ఎన్టీఆర్ ఎప్పుడో ‘యమదొంగ’లో ఓలమ్మీ తిక్కరేగిందా పాటతోనే గాయకుడయ్యాడు కదా. ఇప్పుడు డెబ్యూ సింగర్ ఏంటి అని సందేహం కలుగుతోంది కదా. ఇక్కడే ఉంది ట్విస్టు. ఎన్టీఆర్ నామినేషన్ దక్కించుకున్నది తెలుగు సినిమాకు కాదు. కన్నడ చిత్రానికి.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన ‘చక్రవ్యూహ’ అనే సినిమాలో తారక్.. గెలయా గెలయా అనే పాట పాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ పాట ఇన్ స్టంట్ హిట్టయింది. కన్నడ జనాలకు అది బాగా నచ్చేసింది. ఆ పాటకే తారక్ ఫిలిం ఫేర్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఈ పాటకు తారక్ అవార్డు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదేమో. నటుడిగా ఎన్నో అవార్డులందుకున్నప్పటికీ.. గాయకుడిగా.. అది కూడా కన్నడ నుంచి ఫిలిం ఫేర్ అవార్డు తీసుకుంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ‘చక్రవ్యూహ’ సినిమాకు తమన్ సంగీతాన్నందించాడు. ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ కోసం నందమూరి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న టైంలో ఎన్టీఆర్ కు ఉత్తమ గాయకుడిగా ఫిలిం ఫేర్ నామినేషన్ దక్కిందన్న వార్త వారికి మరింత ఊపునిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/