మహానాయకుడు.. రాక ఖరారయింది

Tue Feb 12 2019 17:33:58 GMT+0530 (IST)

సంక్రాంతి సీజన్లో అందరిలో ఆసక్తి రేకెత్తించడమే కాకుండా విపరీతంగా చర్చలకు దారితీసిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్.  జనవరి 9 న బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' విడుదలయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలవడంతో రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ పై సందేహాలు నెలకొన్నాయి.  కానీ తాజా సమాచారం ప్రకారం మహానాయకుడి రాక ఖరారయింది.ఫిబ్రవరి 22 న 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.  నిజానికి ఫిబ్రవరి 7 వ తారీఖునే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని మార్పుచేర్పుల కారణంగా కొంత ఆలస్యం అయింది. మొదటి భాగం ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని రెండో భాగంలో కొన్ని పాత సీన్లను తొలగించి.. కొన్ని కొత్త సీన్లను కలపడం జరిగిందని టాక్ ఉంది.  మొన్నే ఈ పెండింగ్ షూటింగ్ అంతా పూర్తయిందట.  దీంతో రిలీజ్ డేట్ ను ఫైనలైజ్ చేశారు.

ఇక మొదటి భాగం బయ్యర్లకు 25% నష్టపరిహారం ఇవ్వడానికి బాలకృష్ణ నిర్ణయించుకున్నారట.  ప్రచారంలో ఉన్నట్టు మొదటి భాగం బయ్యర్లకే రెండో భాగం హక్కులు ఇవ్వడం లేదు. సురేష్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుంది.