Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: యన్.టి.ఆర్-కథానాయకుడు

By:  Tupaki Desk   |   9 Jan 2019 9:21 AM GMT
మూవీ రివ్యూ: యన్.టి.ఆర్-కథానాయకుడు
X
చిత్రం : 'యన్.టి.ఆర్-కథానాయకుడు'

నటీనటులు: నందమూరి బాలకృష్ణ - విద్యా బాలన్ - ప్రకాష్ రాజ్ - కళ్యాణ్ రామ్ - సుమంత్ - దగ్గుబాటి రాజా - రానా దగ్గుబాటి - నరేష్ - మురళీ శర్మ - కైకాల సత్యనారాయణ - సాయిమాధవ్ బుర్రా - బ్రహ్మానందం - నిత్య మీనన్ - రకుల్ ప్రీత్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కథా సహకారం: శ్రీనాథ్
నిర్మాతలు: నందమూరి వసుంధర - నందమూరి బాలకృష్ణ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: క్రిష్

సినీ.. రాజకీయ రంగాల్లో శిఖర స్థాయిని అందుకున్న నందమూరి తారక రామారావు జీవిత కథను వెండి తెరపై చూపించే ప్రయత్నం చేశాడు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండు భాగాల ‘యన్.టి.ఆర్’తో మొదటిదైన ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ తారకం (విద్యా బాలన్) తనతో పెళ్లి తర్వాత రకరకాలుగా మలుపులు తిరిగిన భర్త జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. స్వాతంత్రం అనంతరం రిజిస్టరాఫీసులో ఉద్యోగంలో చేరి.. అక్కడ అవినీతిని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆపై సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఎలా వెండి తెర ఇల వేల్పుగా ఎదగడం.. ఆపై రాజకీయాల వైపు అడుగులేయడం.. ఇలా ఆయన జీవితాన్ని తరచి చూపిస్తూ సాగే కథ ఇది.

కథనం - విశ్లేషణ:

గత ఏడాది సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ బయోపిక్‌ లకు కొన్ని ప్రమాణాల్ని నిర్దేశించింది. తర్వాత ఏ బయోపిక్ వచ్చినా కూడా దాంతో పోల్చి చూసే పరిస్థితి ఉందిప్పుడు. ఐతే అందరి కథల్లోనూ సావిత్రి జీవితంలో ఉన్నంత డ్రామా.. మలుపులు ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ కథనే తీసుకుంటే ఆయన సినీ జీవితంలో ఎత్తులే తప్ప పల్లాలనేవి కనిపించవు. ఆరంభంలో కొంచెం ఒడుదొడుకుల్ని మినహాయిస్తే ఆయన సినీ ప్రయాణమంతా సాఫీగా సాగిపోయిందే. ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతూ వెళ్లాడే తప్ప.. ఎన్టీఆర్ ఏనాడూ తన సినీ జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎదుగుదల ఎలా సాగిందన్నది అందరికీ తెలిసిన వ్యవహారమే. రాజకీయ రంగంలో అయినా ఎత్తుపల్లాలున్నాయి కానీ.. సినీ ప్రయాణంలో మాత్రం ఎన్టీఆర్‌ కు ఎదురన్నది లేదు. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఎలా చూపిస్తారనే విషయంలో అనేక సందేహాలున్నాయి. ఐతే అదంతా ‘యన్.టి.ఆర్-మహా నాయకుడు’కు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇప్పుడు చర్చ అనవసరం.

ఇక ఎన్టీఆర్ సినిమా కెరీర్ తో పాటు.. ఆయన రాజకీయాల వైపు అడుగులేసే వరకు చూపించిన చిత్రం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’. కథ పరంగా ఇందులో ఎగ్జైట్ చేసే అంశాలు చాలా తక్కువ. కాకపోతే క్రిష్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడుండటం వల్ల తెలిసిన విషయాలే తెరపై కొంచెం అందంగా.. ప్రభావవంతంగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ ను ఇష్టపడేవాళ్లకు ఆయన కథను ఇలా చూసుకోవడం మహదానందం కలిగిస్తుంది. మిగతా సగటు ప్రేక్షకుల్ని కూడా ఓ మోస్తరుగానే ఎంగేజ్ చేస్తూ సాగుతుంది ‘యన్.టి.ఆర్’. పెద్దగా మలుపుల్లేని ఎన్టీఆర్ సినీ ప్రయాణాన్ని.. నటీనటులు.. సాంకేతిక నిపుణుల అండతో క్రిష్ ప్రభావవంతంగానే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కథ పరంగా మాత్రం ఇందులో ఎగ్జైట్ అయ్యే అంశాలు పెద్దగా లేకపోవడం బలహీనత. ఇక ఎన్టీఆర్ పాత్రలో కనిపించడానికి నందమూరి బాలకృష్ణ పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది కానీ.. యంగ్ ఎన్టీఆర్ గా సగం సినిమా వరకు ఆ పాత్రలో చాలా ఎబ్బెట్టుగా కనిపించి తెగ ఇబ్బంది పెట్టేశాడు. కానీ వయసు మళ్లిన ఎన్టీఆర్ గా మాత్రం బాలయ్య అభినయం మెప్పిస్తుంది. ముఖ్యంగా సినిమాలతో సంబంధం లేకుండా మామూలుగా కనిపించే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్.. నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

‘యన్.టి.ఆర్’లో సగటు ప్రేక్షకులు ఆశించే హై పాయింట్స్ పెద్దగా లేవు. ముఖ్యంగా ప్రథమార్ధంలో మలుపులు.. కొత్త విషయాలేమీ లేకపోవడం.. కథ మరీ ఫ్లాట్ గా సాగిపోవడం వల్ల ప్రేక్షకులకు ఒక దశ దాటాక బోర్ కొడుతుంది. సినీ రంగంలో ఎన్టీఆర్ ముద్ర గురించి చూపించే రెండు మూడు ఎలివేషన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. అందులో ఒకటి ‘మాయా బజార్’ సినిమా కోసం తొలిసారి కృష్ణుడి పాత్రలోకి ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేయడం. ఈ సన్నివేశంలో క్రిష్ బలమైన ముద్ర వేశాడు. ఈ సన్నివేశానికి రాసిన లీడ్.. చిత్రీకరణ.. బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ కూడా గొప్పగా కుదిరి ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం కలుగుతుంది. అలాగే ‘సీతా రామ కళ్యాణం’ సినిమాతో దర్శకత్వం చేపట్టిన ఎన్టీఆర్ ఆ సినిమా కోసం పడ్డ కష్టం.. ఆపై ‘దాన వీర శూర కర్ణ’ కోసం చేసిన సాహసం.. వీటికి సంబంధించిన ఎపిసోడ్లను బాగా చిత్రించారు. ఇంతకుమించి సినిమాలో హై పాయింట్స్ కనిపించవు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ మరణానికి సంబంధించిన ఎమోషనల్ సీన్ కొంచెం కదిలిస్తుంది. ప్రథమార్ధం వరకు అయితే కృష్ణుడి సీన్.. కొడుకు మరణానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి. యుక్త వయసులో ఉన్న బాలయ్య సెట్టవ్వకపోవడం వల్ల ప్రథమార్ధంలో చాలా సీన్లు అంత ప్రభావవంతంగా అనిపించవు.

ఐతే వయసు మీద పడ్డ ఎన్టీఆర్ కు బాలయ్య ఇట్టే సెట్టయిపోవడంతో ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు పండాయి. ముఖ్యంగా రెండో అర్ధంలో సినిమాల బయట ఎన్టీఆర్ జీవితాన్ని చూపించడం వల్ల కథ కూడా కొంచెం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఏఎన్నార్ తో ఎన్టీఆర్ స్నేహం.. వాళ్లిద్దరి అనుబంధానికి సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాగే జనాల బాధల్ని.. రాజకీయ పరిస్థితుల్ని చూసి ఎన్టీఆర్ లో అంతర్మథనం మొదలై రాజకీయాల వైపు అడుగులేసే సన్నివేశాలు కూడా బాగానే తెరకెక్కించారు. ఈ సన్నివేశాల్లోనే సినిమా స్థాయి పెరుగుతుంది. దర్శకుడిగా క్రిష్ పట్టు కూడా ఇక్కడే కనిపిస్తుంది. అక్కడక్కడా కథనంలో వేగం మరీ నెమ్మదించినప్పటికీ.. ‘యన్.టి.ఆర్’లో కథంటూ కనిపించేది.. కథనం ఆసక్తికరంగా నడిచేది మాత్రం ద్వితీయార్ధంలోనే. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఉత్తేజితుల్ని చేసే ఒక సన్నివేశంతో సినిమాను బాగానే ముగించారు. ‘యన్.టి.ఆర్-మహా నాయకుడు’లో ఎంత వరకు నిజాలు చూపిస్తారన్నది పక్కన పెడితే.. ఈ సినిమా ముగింపుతో దానికి ఇచ్చిన లీడ్ మాత్రం బాగుంది. కథ పరంగా ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు కానీ.. ఉన్నంతలో ఈ కథను క్రిష్ అండ్ టీం ఎంగేజ్ చేసే లాగే చెప్పగలిగింది.

నటీనటులు:

బాలకృష్ణ తన తండ్రి పాత్రలో ఒదిగిపోయేందుకు బాగానే కష్టపడ్డారు. కానీ మొదట్లో ఎన్టీఆర్ ఆయన్ని ఒప్పుకోవడానికి.. జీర్ణించుకోవడానికి ప్రేక్షకులు కష్టపడాల్సిందే. బాలయ్య లుక్.. ఓవరాల్ గా ఆయన ఆహార్యం యంగ్ ఎన్టీఆర్ పాత్రకు సూటవ్వలేదు. మేకప్ కూడా కుదరలేదు. ఐతే తర్వాత తర్వాత అలవాటు పడతాం. నెమ్మదిగా బాలయ్య మెప్పిస్తూ వెళ్లాడు. ద్వితీయార్దంలో 60 ఏళ్ల ఎన్టీఆర్ గా బాలయ్య బాగా కుదిరాడు. ఆ సన్నివేశాల్లో బాలయ్య గెటప్ బాగుంది. మేకప్ కూడా కుదిరింది. నటనలోనూ ఒక పరిణతి కనిపిస్తుంది. సటిల్ పెర్ఫామెన్స్ తో ఆ పాత్రను రక్తి కట్టించాడు. ఇక్కడి వరకు బాలయ్య ఎన్టీఆర్ ను దించేశాడు. పతాక సన్నివేశాల్లో బాలయ్య నటన హైలైట్ గా నిలుస్తుంది. బసవ తారకంగా విద్యాబాలన్ ను ఎంచుకోవడం మంచి ఛాయిస్ అయిన ఆమె రుజువు చేసింది. ఆ పాత్రలో హుందాగా నటించింది. ఏఎన్నార్ పాత్రలో సుమంత్ బాగా చేశాడు. ప్రతి సన్నివేశంలోనూ తనదైన ముద్ర వేశాడు. అతడి హావభావాలు సహజంగా అనిపిస్తాయి. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ ఓకే. నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్.. చక్రపాణిగా మురళీ శర్మ.. ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో దగ్గుబాటి రాజా బాగా చేశారు. సాయిమాధవ్ బుర్రా.. నిత్యా మీనన్.. రకుల్ ప్రీత్.. కైకాల సత్యనారాయణ.. క్రిష్.. లాంటి వాళ్లు అతిథి పాత్రల్లో ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం:

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’లో సాంకేతిక నిపుణుల పాత్ర కీలకం. కీరవాణి తన అనుభవాన్నంతా ఉపయోగించి చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. ఎన్టీఆర్ తొలిసారి కృష్ణుడి పాత్రలో కనిపించే సన్నివేశానికి ఆయన ఇచ్చిన ఎలివేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని ఎమోషనల్ సీన్లకు కూడా కీరవాణి తన సంగీతంతో బలం చేకూర్చారు. పాటలు కూడా బాగున్నాయి. కెమెరామన్ జ్ఞానశేఖర్ కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చారు. 1950-80 మధ్య కాలాన్ని అథెంటిగ్గా చూపించడంలో.. అప్పటి వాతావరణం తెరపై ప్రతిబింబించేలా చేయడంలో ఆయన పనితనం కనిపిస్తుంది. ఫిలిం స్టూడియోల్లోని వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడంలో ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్లలో ఒకటి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. అంతటా ఒక స్థాయి కనిపిస్తుంది. సాయిమాధవ్ బుర్రా అక్కడక్కడా కొన్ని మంచి మాటలు రాశాడు. ఇక దర్శకుడు క్రిష్.. ఎన్నో పరిమితుల మధ్య ఎన్టీఆర్ కథను జనరంజకంగానే తీర్చిదిద్దాడు. చాలా సన్నివేశాల్లో అతడి అభిరుచి.. స్థాయి కనిపిస్తుంది. కథనంలో ఇంకొంచెం వేగం చూపించి ఉంటే.. ఇంకొన్ని హై పాయింట్లతో స్క్రిప్టును తీర్చిదిద్దుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.

చివరగా: యన్.టి.ఆర్-కథానాయకుడు.. మలుపుల్లేవు కానీ మెప్పిస్తుంది

రేటింగ్- 3/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater