అప్పుడే వస్తున్నావా కథానాయకా ?

Tue Jan 22 2019 07:00:01 GMT+0530 (IST)

సినిమా హక్కుల విషయంలో డిజిటల్ విప్లవం తెచ్చిన అమెజాన్ ప్రైమ్ పుణ్యమా అని కొత్త సినిమాల లైఫ్ తగ్గిపోతూ వినోద ప్రియులకు అతి తక్కువ టైంలోనే అందుబాటులోకి వస్తున్నాయి. థియేటర్లో విడుదలైన నెల తిరక్కుండానే నాలుగు రోజుల గ్యాప్ లో అంతరిక్షం-పడి పడి లేచే మనసు ఆన్ లైన్ లోకి వచ్చేయడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే వరుసలో ఎన్టీఆర్ కథానాయకుడు రాబోతున్నట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ బయోపిక్ ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే నెల రోజులు తిరక్కుండానే వచ్చేసినట్టు. అప్పటికి మహానాయకుడు విడుదల అయ్యుండదు. ముందు అనుకున్న డేట్ ఫిబ్రవరి 8. ఒకవేళ వాయిదా పడినా మరో వారం ముందుకు వెళ్తుంది. కానీ ఆ లోపు ఎన్టీఆర్ కథానాయకుడు లాప్ టాప్స్ స్మార్ట్ ఫోన్స్ లోకి వచ్చేస్తాడన్న మాట. ఆల్ టైం డిజాస్టర్స్ లో చోటు దక్కించుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు ఇంత త్వరగా రావడంలో ఆశ్చర్యం లేదు కానీ బాలకృష్ణ లాంటి స్టార్ హీరో మూవీకి కూడా ఇలా జరగడం వింతే.

ఈ ధోరణి చూస్తుంటే రానున్న రోజుల్లో అమెజాన్ ప్రైమ్ కొన్న సినిమాలకు టాక్ తేడా వస్తే జనం మొదటి రోజుల్లోనే చూడటం తగ్గిస్తారేమో. గత ఏడాది నుంచి స్పీడ్ పెంచి క్రేజీ సినిమాలన్నీ భారీ ఆఫర్లు ఇచ్చి మరీ కొంటున్న అమెజాన్ ప్రైమ్ వద్ద సంక్రాంతి సినిమాలన్నీ ఉన్నాయి. వారం పది రోజుల గ్యాప్ తో అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కథానాయకుడు టాక్ బాగున్నా ఇలా తొందరగా రావడం వల్ల మహానాయకుడుకి ట్రైలర్ లా ఉపయోగపడుతుందని అభిమానులు భావిస్తున్నారు.