ఎన్టీఆర్ కథానాయకుడు.. అదో 'క్రియేషన్'

Tue Jan 22 2019 07:00:01 GMT+0530 (IST)

బయోపిక్ లు తీసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి బయోపిక్ అయితే తీస్తున్నారో వారి జీవితంలో అన్ని విషయాలను చూపించడం అసాధ్యం. కొన్ని కీలక విషయాలను చూపించాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన ఘటం మర్చి పోయినా పర్వాలేదు కాని వారి జీవితంలో జరగని విషయన్ని జరిగినట్లుగా చూపిస్తే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 'మహానటి' చిత్రంలో కొన్ని సీన్స్ అలా విమర్శల పాలైన విషయం తెల్సిందే. సావిత్రి జీవితంలో జరగని కొన్ని విషయాలను కల్పించి చూపించే ప్రయత్నం చేసశారంటూ అప్పట్లో ఆమెతో సన్నిహితంగా ఉండే వారు చెప్పారు.ఇప్పుడు ఎన్టీఆర్ లో కూడా అలాంటి సన్నివేశం ఒకటుందని తేలిపోయింది. 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలో 'పెళ్లి చేసి చూడు' చిత్రంకు సంబంధించిన పాట సీన్ ఉంది. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్... అంటూ సాగే పాట చిత్రీకరణ సమయంలో బసవతారకం గారు అక్కడ ఉన్నట్లుగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో చూపించారు. ఆ చిత్రం షూటింగ్ కు మాత్రమే కాదు ఏ చిత్రం షూటింగ్ కు కూడా బసవతారకం గారు హాజరు అవ్వడం ఆమె ఎన్టీఆర్ గారికి హార్మోనియం నేర్చించడం జరగలేదంటూ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు.

పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్ పాటలో ఎన్టీఆర్ వెనుక డాన్స్ వేసే చిన్న పిల్లాడి పాత్ర పోషించిన మాస్టర్ కుందు అప్పటి విషయాలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ పాటను సినిమా కోసం రెండు రోజులు షూట్ చేశారు రెండు రోజుల్లో బసవతారకం గారు వచ్చిందే లేదు. పాట చిత్రీకరణకే కాదు అసలు సినిమా షూటింగ్ లో ఆమెను ఎప్పుడు తాను చూడలేదంటూ ఆయన చెప్పుకొచ్చాడు. క్రిష్ ఈ చిత్రాన్ని సినిమాటిక్ గా తెరకెక్కించే క్రమంలో ఆ సీన్ ను క్రియేట్ చేసినట్లున్నాడు.