కాబట్టి ఎన్టీఆర్ సేఫ్ అన్నమాట

Sun Jan 14 2018 13:05:35 GMT+0530 (IST)

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎట్టకేలకు కన్ఫమ్ కావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కెరీర్ ఆరంభంలోనే చాలా మంది పెద్ద దర్శకులతో పని చేసిన ఎన్టీఆర్ కు ఎందుకో గానీ త్రివిక్రమ్ తో మాత్రం సెట్టవ్వలేదు. చివరికి గత ఏడాది త్రివిక్రమ్-ఎన్టీఆర్ ప్రాజెక్టు ఓకే అయింది. ఆ సమయానికి పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ లాంటి క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ రేంజ్ పీక్స్ కు వెళ్లిపోతుందని.. అలాంటి టైంలో ఎన్టీఆర్ తో సినిమా చేస్తే దానికొచ్చే క్రేజే వేరుగా ఉంటుందని.. ఆలస్యమైనా సరైన సమయంలో ఈ కాంబినేషన్ ఓకే అయిందని సంతోషించారు ఫ్యాన్స్. కానీ ‘అజ్ఞాతవాసి’ రిలీజ్ తర్వాత కథ మారింది.తన కెరీర్లోనే వీకెస్ట్ మూవీ తీసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు త్రివిక్రమ్. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తో సినిమా అనగానే అభిమానుల్లో కలవరం మొదలైంది. ఐతే త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు చూసిన వాళ్లు మాత్రం కంగారు అక్కర్లేదని అంటున్నారు. తన కెరీర్లో కొంచెం వీక్ సినిమా తీసినపుడల్లా త్రివిక్రమ్ మేల్కొని.. తర్వాతి సినిమాకు కసిగా పని చేసి గట్టిగా పుంజుకున్న సందర్భాలున్నాయి. త్రివిక్రమ్ కెరీర్లో ఇంతకుముందు ఏకైక ఫ్లాప్ ‘ఖలేజా’ తర్వాత ‘జులాయి’తో తనేంటో రుజువు చేశాడు. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇక ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విషయంలోనూ త్రివిక్రమ్ అంచనాలు అందుకోలేకపోయాడు. ఆ వెంటనే ‘అఆ’తో మళ్లీ తన సత్తా చాటాడు. ఈ సినిమా విషయంలో చాలా శ్రద్ధ పెట్టాడు. అన్ని రకాలుగా మెప్పించాడు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’తో ఎన్నడూ లేని స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు త్రివిక్రమ్. కాబట్టి ఎన్టీఆర్ సినిమా విషయంలో మరింత కసిగా పని చేసి తన సత్తా ఏంటో చూపిస్తాడని.. కాబట్టి నందమూరి అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు.