దేవరకొండపై తారక్ ఫ్యాన్స్ వీరంగం

Sat Sep 22 2018 09:58:22 GMT+0530 (IST)

సామాజిక మాధ్యమాల వేదికగా ఫ్యాన్స్ వీరంగం గురించి తెలిసిందే. అభిమానులు తాము ఏం చెప్పదలుచుకున్నా ట్విట్టర్ - ఎఫ్ బి - ఇన్ స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో చెప్పేస్తున్నారు. వీటిలో డిబేట్ ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండకు తారక్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇవ్వడం ఫిలింనగర్ లో చర్చకు తావిచ్చింది.ఒక హీరో అభిమానులు - వేరొక హీరోకి వార్నింగ్ ఇవ్వడం - ఇతర హీరోల అభిమానులతో గొడవలు పడడం అన్నది అనాదిగా ఉన్నదే. కానీ ఇలా సామాజిక మాధ్యమాల్లో వీరంగం వేయడం అన్నది లేటెస్ట్ ట్రెండ్. అయితే తారక్ ఫ్యాన్స్ దేవరకొండకు హెచ్చరికలు జారీ చేయడానికి కారణమేంటి? అంటే .. అతడు నటించిన `నోటా` చిత్రాన్ని `అరవింద సమేత`కు పోటీగా రిలీజ్ చేయకూడదనేది ఫ్యాన్స్ ఉద్ధేశం. అలా రిలీజ్ చేస్తే `నోటా` బాక్సాఫీస్ వార్ లో ఐపు లేకుండా పోతుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ సునామీ ముందు ఇంకేదీ నిలవదని అభిమానం చాటుకున్నారు. ఆ క్రమంలోనే దేవరకొండ తన సినిమా నోటా రిలీజ్ కి ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తూ పెద్ద షాకిచ్చాడు. నోటా రిలీజ్ కి మూడు తేదీల్లో ఏదో ఒకటి మీరే డిసైడ్ చేయండి అంటూ అక్టోబర్ 5 లేదా 10 లేదా 18 అంటూ తేదీల్ని ప్రకటించాడు. వీటిలో ఏదో ఒక తేదీని ఓటింగ్ ద్వారా ఎంపిక చేయాల్సిందిగా కోరాడు.

ఎన్టీఆర్ `అరవింద సమేత` అక్టోబర్ 10న రిలీజవుతోంది. ఆ తర్వాత అక్టోబర్ 18న రామ్- `హలో గురు ప్రేమకోసమే` - విశాల్- `పందెంకోడి- 2` చిత్రాలు రిలీజవుతున్నాయి. ఇవన్నీ `నోటా`కి ఠఫ్ కాంపిటీషన్ ఇచ్చేవే. `గీత గోవిందం` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దేవరకొండ `నోటా`పై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ కి చక్కని స్పందన దక్కింది. అయితే `అరవింద సమేత` క్రేజ్ పీక్స్ లో ఉంది. అలానే రామ్ - విశాల్ సినిమాలకు క్రేజు తక్కువేం లేదు. అందుకే `నోటా` ఆ సినిమాల కంటే ముందే అక్టోబర్ 5న రిలీజైపోతే మంచిదని మేకర్స్ భావిస్తున్నారట. అదే తేదీకి నారా రోహిత్ `వీరభోగ వసంతరాయలు` చిత్రం రిలీజవుతోంది.