Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బయోపిక్.. ఎలా బ్రేక్ చేస్తారు?

By:  Tupaki Desk   |   24 Jun 2018 5:52 AM GMT
ఎన్టీఆర్ బయోపిక్.. ఎలా బ్రేక్ చేస్తారు?
X
మొత్తానికి క్రిష్ రాకతో ఎన్టీఆర్ బయోపిక్ కు మళ్లీ ఊపిరి వచ్చింది. ఈ సినిమాపై ముందు కంటే కూడా ఆసక్తి పెరిగింది. క్రిష్ ఏం చేసినా ఆషామాషీగా చేయడు. సిన్సియర్ ఎఫర్ట్ పెడతాడు. దేన్నయినా గొప్పగా ప్రెజెంట్ చేయాలని చూస్తాడు. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ కూడా గొప్పగా తయారవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. క్రిష్ మీద ఉన్న గౌరవంతో బాలయ్య కూడా కొంచెం దిగి వస్తాడని.. కథను చెప్పే విధానంలో మొండి పట్టు వీడుతాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కథ ఎలా మొదలై.. ఎలా ముగుస్తుందనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచన తెరమీదికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇది నిజంగా సాధ్యమేనా అన్నది సందేహం.

రెండు భాగాలు తీయాలనుకుంటే.. తొలి సినిమాను ఎక్కడ బ్రేక్ చేస్తారన్నది ఆసక్తికరం. ఈ విషయంలో అందరికీ కనిపించే ఆప్షన్ ఒకటే. సినీ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చలాయించి.. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే చరిత్ర సృష్టిస్తూ ముఖ్యమంత్రి అయిన దగ్గర క్లైమాక్స్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి మరో భాగాన్ని చూపించాలి. అప్పుడు తొలి సినిమా పూర్తి పాజిటివ్ గా తయారవుతుంది. ముఖ్యమంత్రి అయిన కొన్నేళ్ల నుంచే ఎన్టీఆర్ జీవితంలో ఒడుదొడుకులూ మొదలయ్యాయి. ఆ తర్వాత అంతా ఎక్కువగా ఎదురు దెబ్బలే కనిపిస్తాయి. ఆయన పతనం కనిపిస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలు.. కుతంత్రాలు.. వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు అన్నీ చూపించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయాలన్నీ ఓపెన్ గా చూపించేంత సాహసం బాలయ్య-క్రిష్ చేయగలరా అన్నది సందేహం. అదే చేస్తే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు.. ముఖ్యంగా చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అది ఆయనకు ప్రతికూలంగా మారుతుంది. ఇందుకు బాలయ్య ఒప్పుకునే అవకాశాలు తక్కువ. అలాగని వీటన్నింటినీ పరిహరిస్తే రెండో భాగంలో చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. డ్రామా మొత్తం అటకెక్కేస్తుంది. సినిమా ప్లెయిన్ గా తయారవుతుంది. అసలు కథంటూ ఏమీ మిగలదు. కాబట్టి ఎన్టీఆర్ సినిమాను రెండు భాగాలుగా తీయడం అన్నది కష్టమైన వ్యవహారమే. మరి క్రిష్ ఆలోచన ఎలా ఉందో?