బాల 'కృష్ణుడు' లీకయ్యాడే

Wed Jul 11 2018 11:56:01 GMT+0530 (IST)

నందమూరి అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ఎంత గోప్యంగా జరుగుతున్నా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. తాజాగా ఆన్ ది సెట్ లొకేషన్ లో ఉన్న ఫోటో ఒకటి బయటికి రావడంతో నిమిషాల్లో అది వైరల్ అయిపోతోంది. అందులో బాలకృష్ణ తన తండ్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృష్ణుడి గెటప్ లో ఉండగా పక్కన మురళీశర్మ చక్రపాణిని పోలిన వేషంలో ఉన్నాడు. ఇదే  పాత్ర మహానటిలో ప్రకాష్ రాజ్ వేసాడు. ఇప్పుడు దీన్ని చూసిన ఫాన్స్ అప్పుడే అంచనాలకు వచ్చేస్తున్నారు. ఇక్కడ పిక్ లో చూస్తున్న సందర్భం బహుశా మాయాబజార్ షూటింగ్ ది కావచ్చు. సావిత్రి-ఎన్టీఆర్-ఎఎన్ ఆర్- ఎస్విఆర్ వీళ్ళలో ఎవరి బయోపిక్ తీసినా ఆ కళాఖండం ప్రస్తావన లేకుండా తీయడం అసాధ్యం. అందుకే మహానటి తరహాలోనే ఇందులో కూడా మాయాబజార్ రిఫరెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.వచ్చే జనవరిలో సంక్రాంతిని టార్గెట్ చేసుకుని విడుదల అవుతున్న ఎన్టీఆర్ లో బాలయ్య 50 పైగా నాన్న గెటప్స్ లో కనిపిస్తారని ముందు నుంచే వార్తలు ఉన్నాయి. దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని రెడీ గా ఉన్నట్టు కూడా సమాచారం. మహానటి సెకండ్ హాఫ్ లో ఎక్కువగా సావిత్రి గారి వ్యక్తిగత జీవితం ఫోకస్ పెట్టిన తరహాలో కాకుండా ఎన్టీఆర్బయోపిక్  మొత్తం సినిమా జీవితం పైనే ఉంటుందట. కాకపోతే  నాగ అశ్విన్ మహానటి కోసం  కొందరు సీనియర్లను వాడేసుకున్నాడు కాబట్టి ఎన్టీఆర్ దానికి  భిన్నంగా కనిపించాలి అంటే అందులో లేని వాళ్ళను తీసుకుంటేనే ఎఫెక్ట్ బాగుంటుంది. అందుకే ఆ విషయంలో క్రిష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు సమాచారం. పైన లీక్ అయిన స్టిల్ ని లవకుశ అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయినా ఇలాంటి గెటప్స్ లో  బాలయ్యను  శ్రీరామరాజ్యంలో ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఇది మరీ ఎగ్జైటింగ్ గా లేదు కానీ షూటింగ్ సవ్యంగా జరుగుతోందన్న భరోసాను మాత్రం భేషుగ్గా ఇచ్చేసింది.