వారాలబ్బాయి ఇకపై కనిపించడు

Sun Sep 24 2017 23:59:10 GMT+0530 (IST)

టాలీవుడ్ అగ్రనటుల్లో ఒక వ్యక్తి.. ఉన్నట్లుండి బుల్లితెరలో ఒక షోకు యాంకరింగ్ చేయటాన్ని ఊహించగలమా? ఎన్నో సందేహాలు.. మరెన్నో ప్రశ్నలతో పాటు.. ఏ మాత్రం తేడా వచ్చినా అప్పటివరకూ ఉన్న ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే ముప్పు పొంచి ఉంటుంది. అయితే.. ఆ రిస్క్‌ను ఏ మాత్రం లెక్క చేయకుండా బిగ్ బాస్ షోకు యాంకరింగ్ చేసేందుకు ఓకే చేసేశాడు తారక్.భారీ ఇమేజ్ ఉన్న అగ్రహీరో ఒకరు రియాల్టీ షోకు యాంకరింగ్ చేసేందుకు ఓకే చెప్పటం ఒక సంచలనంగా మారటమే కాదు.. హాట్ న్యూస్ గా మారింది. ఇదెంత పెద్ద వార్త అయ్యిందంటే.. ప్రింట్.. ఎలక్ట్రానిక్.. వెబ్ అన్న తేడా లేకుండా అన్నింట్లోనూ ప్రముఖంగా ఈ న్యూస్ వచ్చేసింది.

తారక్ లాంటి హీరో ఒక రియాల్టీ షోకు ఓకే చెప్పేయటంతో.. బిగ్ బాస్ సీజన్ 1కు అంచనాలు భారీగా  పెరిగిపోయాయి. ఇక.. బిగ్ బాస్ పోటీదారులు ఎవరన్న ఆసక్తి వ్యక్తమైనప్పటికీ.. అంచనాలకు తగినట్లుగా పోటీదారులు బరిలోకి దిగలేదని చెప్పాలి.

బిగ్ బాస్ ఇంట్లో ఉండే 14 మంది సెలబ్రిటీలను పరిచయం చేసినప్పుడు పలువురు పెదవి విరిచారు. దీంతో.. తారక్ మీద మరింత భారం పడింది. వారంలో రెండు రోజులు మాత్రమే కనిపించే ఆయన.. షో మొత్తానికి కీలకమయ్యారు. మొదట్లో తారక్ యాంకరింగ్ మీద మిక్సడ్ కామెంట్లు వచ్చినప్పటికీ.. మూడో వారానికి వచ్చేసరికి సెటిల్ కావటం కనిపించింది.

మూడు.. నాలుగో వారం నుంచి చెలరేపోయిన తారక్.. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎప్పటికప్పుడు మరింత మెరుగుపర్చుకుంటూ తనదైన శైలిలో యాంకరింగ్ చేయటమే కాదు.. తెలుగు బిగ్ బాస్ షోకు తారక్‌కు మరో ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని తేల్చేశారని చెప్పాలి. ఇక.. గ్రాండ్ ఫైనల్ రోజున ఉత్సాహంగా యాంకరింగ్ చేసిన తారక్.. షో చివర్లో భావోద్వేగానికి గురయ్యారు.

తన తల్లి తనకు వారాలబ్బాయి కథ చెబుతుండేదని.. తాను ఈ షోలో చేసింది వారాలబ్బాయి పనేనని.. తెలుగు వాళ్లంతా ఎంతో అభిమానంతో ఈ వారాలబ్బాయి (తనని తాను) ఆదరించిన వారందరికి నమస్కారం అంటూ చెప్పిన మాటలు పలువురి కంట కన్నీరు పెట్టించాయి. పది వారాలుగా ప్రతి వీకెండ్ బుల్లితెర మీద తళుక్కున మెరిసి..సందడి చేసే తారక్ ఈ వీకెండ్ నుంచి  కనిపించరన్నది పెద్ద లోటే.  బిగ్ బాస్‌కు భారీగా కనెక్ట్ అయిన తెలుగు ప్రజలకు.. మరీ ఇంతలా మరో ప్రోగ్రాంకు కనెక్ట్ కావటం అంత తేలికైన విషయం కాదని చెప్పాలి. ఏమైనా.. తన మాటలతో.. చేష్టలతో మురిపించి.. మరిపించి.. మనసును దోచుకున్న తారక్ నోట వచ్చిన వారాలబ్బాయి మాట ప్రతి తెలుగోడిని సూటిగా టచ్ చేసిందని చెప్పక తప్పదు.