ఎన్టీఆర్ బాగానే చేశాడు కానీ..

Mon Jul 17 2017 15:07:55 GMT+0530 (IST)

మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్’ టీవీ రియాల్టీ షో మొదలైపోయింది. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ఈ షో ఆరంభోత్సవం జరిగింది. పార్టిసిపెంట్ల విషయంలో నిన్నటి ఊహాగానాలే నిజమయ్యాయి. సంపూర్ణేష్ బాబు.. శివబాలాజీ.. ప్రిన్స్.. ఆదర్శ్ బాలకృష్ణ.. సమీర్.. ధనరాజ్.. మహేష్ కత్తి మేల్ పార్టిసిపెంట్లు కాగా.. ముమైత్ ఖాన్.. అర్చన.. మధుప్రియ.. కల్పన.. హరితేజ.. జ్యోతి.. కత్తి కార్తీక అమ్మాయిల జాబితాలో ఉన్నారు. ఇంతకముందు అనుకున్నట్లు పార్టిసిపెంట్లు 12 మది కాదు.. 14 మంది. షో ప్రారంభోత్సవంలో వీళ్లందరి ఎంట్రీని వైవిధ్యంగా.. గ్రాండ్ గా ప్లాన్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

ఇక ప్రారంభోత్సవానికి ప్రధాన ఆకర్షణ అంటే ఎన్టీఆరే అనడంలో మరో మాట లేదు. తన మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లే అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ తో.. ఎనర్జీతో.. చక్కటి వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. తెలుగు టెలివిజన్లోకి వచ్చిన సెలబ్రెటీ హోస్టుల్లో ఎన్టీఆర్ ‘ది బెస్ట్’ అనిపించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేవలం వ్యాఖ్యానంతోనే కాదు.. ఫస్ట్ ఎపిసోడ్లో తన తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తోనూ అలరించాడు తారక్. ఐతే అంతా బాగుంది కానీ.. ఎన్టీఆర్ అక్కడక్కడా మాత్రం కొంచెం అతి చేశాడన్న అభిప్రాయం కలిగింది. కొన్ని చోట్ల అవసరానికి మించి ఉత్సాహం ప్రదర్శించడం.. అతిగా నవ్వడం.. చురుకుదనం ఎక్కువైపోవడం ఇబ్బందిగా అనిపించాయి. మధుప్రియ ఆడపిల్లల గురించి పాట పాడినపుడు ఎమోషన్ ఎక్కువ చూపించేశాడన్న కామెంట్లు పడ్డాయి సోషల్ మీడియాలో. ఐతే ఈ చిన్న చిన్న ప్రతికూలతల్ని పక్కన పెడితే.. ఓవరాల్ గా ఎన్టీఆర్ ఈ షోను నడిపించిన విధానం.. అతడి వ్యాఖ్యానం సూపర్బ్ అనే చెప్పాలి.