అక్కడుంటే నిజాయితీ.. బయట యాక్టింగ్

Sun Aug 13 2017 15:14:47 GMT+0530 (IST)

మన సెలబ్రిటీలు ఎప్పుడు ఎలా మాట్లాడతారో వారికీ తెలియదు కొన్నిసార్లు. ముఖ్యంగా బిగ్ బాస్ వంటి కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు.. అసలు ఏం చెబుతున్నారో కూడా వారికే క్లారిటీ లేని పరిస్థితి. నిజానికి బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక చాలామంది ఇంటర్యూలు చూస్తే.. ఒక విషయం తెలుస్తుంది. వీళ్లందరూ బయటకొచ్చాక రచ్చ చేస్తున్నారని.

ఎన్టీఆర్ తొలసారిగా బుల్లితెరపై హోస్టింగ్ చేస్తున్న షో మాత్రమే కాకుండా.. తొలిసారిగా తెలుగు వారు కూడా చూస్తున్న షో 'బిగ్ బాస్'. ఇందులో చాలామంది కంటెస్టంట్లను ఇప్పటికే ఎలిమినేట్ చేశారు. వీళ్ళందరూ బయటకొచ్చాక.. లోపల కేవలం యాక్టింగ్ మాత్రమే చేయాలని.. అలా చేస్తేనే అక్కడ ఉండగలం అని.. తమకు అలా నటించడం రాదు కాబట్టే బయటకు వచ్చేశాం అంటున్నారు. మొత్తానికి లోపల నుండి వచ్చాకేమో లోపలంతా యాక్టింగే అనడం.. లోపల ఉన్నప్పుడు మాత్రం మేం చాలా నిజాయితీగా మాకు మేం అన్నట్లు ఉంటున్నాం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. నాట్యమాడలేనోడు మద్దెలు మేడ్ ఇన్ చైనా కాబట్టి నేను డ్యాన్స్ వేయను అన్నట్లుంది యవ్వారం.

ఏదేమైనా కూడా బిగ్ బాస్ పాల్గొనడం వలన అసలు జనాలు మర్చిపోతున్నారు అనుకున్న సెలబ్రిటీలకు మరోసారి జనాల నోళ్లలో నానే ఛాన్సు వచ్చేసింది. అలా రావడం కారణంగా వారు చాలా హ్యాపీగా కొత్తకొత్త అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. అదంతా చూసి ఆనందించక.. బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో ఉంటే జైల్లో ఉన్నట్లుంది అంటూ కామెంట్ చేయడం ఏంటి బాబాయ్!!