Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఎనిమిది నెలల తర్వాత..

By:  Tupaki Desk   |   17 Feb 2017 8:14 AM GMT
ఎన్టీఆర్ ఎనిమిది నెలల తర్వాత..
X
వరుసగా మూడు హిట్లు కొట్టేసి మాంచి ఊపులోకి వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హ్యాట్రిక్ మూవీ ‘జనతా గ్యారేజ్’ చేస్తుండగానే వక్కంతం వంశీ దర్శకత్వంలో తర్వాతి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు కానీ.. ఎందుకు ఆ కథ మీద గురి కుదరక పక్కన పెట్టేశాడు. దీంతో మూడు హిట్ల తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మధ్యలో అనేకానేక కథలు విని.. చివరికి బాబీ చెప్పి త్రిపాత్రాభినయ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యంగ్ టైగర్. ఈ చిత్రం వారం కిందటే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. రెగ్యులర్ షూటింగ్ ఒకటి రెండు రోజుల్లో మొదలు కానుంది. ఐతే ఎన్టీఆర్ మాత్రం షూటింగుకి రావడానికి కొంచెం ఆలస్యమవుతోంది.

బాబీ సినిమాలో ఎన్టీఆర్ మేకప్ కోసం హాలీవుడ్ నిపుణుడు వాన్స్ హార్ట్ వెల్ పని చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అమెరికాకు వెళ్లిన హార్ట్ వెల్.. ఇంకో వారంలో తిరిగి హైదరాబాద్ రాబోతున్నాడు. అతనొచ్చి తన లుక్.. మేకప్ అన్నీ ఫైనలైజ్ చేయగానే ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగుకి హాజరవుతాడు. ‘జనతా గ్యారేజ్’కు సంబంధించి తన పనిని గత ఏడాది జులైలోనే పూర్తి చేసిన ఎన్టీఆర్.. దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో పూర్తి చేసి.. ఆగస్టులోనే రిలీజ్ చేయాలని ప్రణాళిక వేసుకుంది బాబీ-ఎన్టీఆర్ బృందం. ఈ చిత్రానికి రాశి ఖన్నా.. నివేదా థామస్ హీరోయిన్లుగా ఫిక్సవగా.. తక్కువ నిడివి ఉన్న మరో హీరోయిన్ పాత్రకు ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. ముందు షూటింగ్ మొదలుపెట్టేసి.. తర్వాత ఈ మూడో హీరోయిన్ సంగతి తేలుద్దామని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/