ఎన్టీఆర్.. నెవర్ బిఫోర్ రోల్?

Tue Dec 12 2017 16:48:00 GMT+0530 (IST)

తొలి సినిమా ‘నిన్ను చూడాలని’లో తప్పిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ లవర్ బాయ్ రోల్ చేసింది లేదు. రెండో సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’లోనే అతను మాస్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఇక ‘ఆది’లో హెవీ మాస్ క్యారెక్టర్ చేయడంతో అతడి ఇమేజే మారిపోయింది. ఇక ఆ తర్వాత కూడా మాస్ మసాలా పాత్రలే చేయాల్సి వచ్చింది. తన కెరీర్లో చాలా వరకు హెవీ వెయిట్ ఉన్న పాత్రలే చేశాడతను. క్లాస్ క్యారెక్టర్లు.. ముఖ్యంగా లవర్ బాయ్ పాత్రల జోలికే వెళ్లలేదు. ఈ మధ్య కొంచెం క్లాస్ టచ్ ఉన్న పాత్రలు ట్రై చేసినా.. లవర్ బాయ్ లాగా అయితే కనిపించలేదు. ఐతే కెరీర్లో తొలిసారిగా ఎన్టీఆర్ లవర్ బాయ్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా గురించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఇది రొమాంటిక్ వేలో సాగే ఫ్యామిలీ డ్రామా అని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ క్లాస్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడట. అతడి పాత్రలో లవర్ బాయ్ లక్షణాలు ఉంటాయట. చాలా తక్కువ శాతం మాత్రమే యాక్షన్ పార్ట్ ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ బలానికి తగ్గ సినిమానే చేయాలని.. తన ఇమేజ్ గురించి ఆలోచించొద్దని.. ఈ సినిమాతో క్లాస్ యూత్.. ఫ్యామిలీ ఆడియన్స్ లోకి మరింతగా చొచ్చుకెళ్లాలని ఎన్టీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నాడట. ఈ విషయమే త్రివిక్రమ్ కు స్పష్టం చేసి.. ఆ ప్రకారమే కథను తీర్చిదిద్దేలా చూసుకున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా కోసం బరువు తగ్గి లుక్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు తారక్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.