Begin typing your search above and press return to search.

'అరవింద సమేత' ఆడియోలో ఒక విచిత్రం

By:  Tupaki Desk   |   23 Sep 2018 11:30 AM GMT
అరవింద సమేత ఆడియోలో ఒక విచిత్రం
X
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ ఆడియో మూడు రోజుల కిందటే డైరెక్టుగా మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఆడియో విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఆడియో బాగుందంటే.. కొందరు పెదవి విరిచారు. ఐతే మిగతా విషయాల మాటెలా ఉన్నా సాహిత్యం విషయంలో ‘అరవింద సమేత’ పాటలు టాప్ క్లాస్ అనడంలో సందేహం లేదు. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాస్తే.. రామజోగయ్య శాస్త్రి ఇంకో రెండు పాటలు పంచుకున్నారు. సీతారామశాస్త్రి సాహిత్యం గురించి కొత్తగా చెప్పేదేముంది? తన స్థాయికి తగ్గట్లే గొప్ప పాటలు అందించారాయన. ఒక పాటలో పెంచల్ దాస్ ఆయనకు సహకారం అందించారు. రామజోగయ్య కూడా సీతారామశాస్త్రితో పోటీ పడి గొప్ప సాహిత్యం అందించాడు.

విశేషం ఏంటంటే.. ఈ సినిమాలోని పాటల్లో ఒక్కటంటే ఒక్క ఆంగ్ల పదం కూడా లేదు. నాలుగు పాటల్లో స్వచ్ఛమైన తెలుగు పదాలే వినిపిస్తాయి. గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో ఏవైనా పౌరాణికాలు.. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు.. పీరియడ్ ఫిలిమ్స్ మినహాయిస్తే ఇప్పటి నేపథ్యంలో నడిచే సినిమాలు వేటిలోనూ ఇంగ్లిష్ పదాలు లేకుండా పాటలు వినిపించవు. త్రివిక్రమ్ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నింట్లోనూ ఏదో ఒక పాటలో ఇంగ్లిష్ పదాలుంటాయి. కానీ ‘అరవింద సమేత’ మాత్రం ఇందుకు మినహాయింపు. ‘పెనివిటి’.. ‘ఏడ బోయినాడో’.. పాటలు పూర్తిగా నేటివిటీతో సాగుతాయి కాబట్టి ఇంగ్లిష్ వాడకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఐతే ‘అనగనగనగా’.. ‘రెడ్డి ఇటు సూడు’ పాటల్లో ఇంగ్లిష్ వాడటానికి ఆస్కారం ఉంది. కానీ సీతారామశాస్త్రి.. రామజోగయ్య శాస్త్రి అలాంటి ఆలోచనే చేయలేదు. బహుశా త్రివిక్రమ్.. గీత రచయితలు ముందే అనుకుని ఇంగ్లిష్ వినియోగాన్ని నివారించి ఉంటారేమో.