యంగ్ టైగర్ బరిలో దూకే డేట్ వచ్చేసింది

Tue Mar 20 2018 17:19:28 GMT+0530 (IST)

జై లవకుశ వచ్చి ఆరు నెలలు అవుతున్నా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో  సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లాప్ తో ఇదివరకే ప్రారంభోత్సవం చేసుకున్నా ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత డీలా పడిన మాట నిజం. కాని అది తన ఫిజిక్ ని కొత్తగా మేకోవర్ చేసుకోవడం కోసమని తెలిసాక కుదుటపడ్డారు. తాజా సమాచారం మేరకు  ఏప్రిల్ 12 నుంచి నిరవధిక షూటింగ్ కు వెళ్ళబోతున్నట్టు టాక్. హైదరాబాద్ ఫిలిం సిటీలోనే నెలాఖరు దాకా చేసి ఆ తర్వాత ఒక్క వారం మాత్రమే గ్యాప్ ఇచ్చి రెండో షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్క్రిప్ట్ లాక్ చేసేసిన త్రివిక్రమ్ అజ్ఞాతవాసి ఫలితం గురించి పట్టించుకోకుండా తన బెస్ట్ స్క్రిప్ట్స్ లో ఒకటిగా ఉండేలా దీన్ని పక్కాగా రాసుకున్నట్టు సమాచారం.చాలా ప్లాన్డ్ అండ్ టైట్ షెడ్యూల్స్ తో ఈ సినిమాను దసరా లేదా దీపావళి లోపు ఫినిష్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. జాప్యం లేకుండా ఇది ఫినిష్ చేస్తే ఆ తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ కోసం జూనియర్ సిద్ధపడాల్సి ఉంటుంది. విడుదల ఎప్పుడు అనుకుంటున్నారు అనే దాని గురించి న్యూస్ అయితే ప్రస్తుతానికి లేదు. జనతా గ్యారేజ్  - జై లవకుశ తరహాలో పండగ సీజన్ ని టార్గెట్ చేసుకుంటే కనక దసరాకు రిలీజ్ చేయాలి. అదే నిజమైతే పాటలతో సహా షూటింగ్ మొత్తం ఆరు నెలల్లో పూర్తి చేస్తే తప్ప సాధ్యం కాదు. తారక్ లాంటి స్టార్ హీరోతో ఇది కొంచెం కష్టం కాని అసాధ్యం అయితే కాదు. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇతర కీలక పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారు అనే వివరాలు బయటికి పొక్కకుండా టీం జాగ్రత్త పడుతోంది. తమన్ ట్యూన్స్ ఇస్తున్న ఈ సినిమా హారికా అండ్ హాసిని బ్యానర్ పై రూపొందుతున్న సంగతి తెలిసిందే