Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-త్రివిక్రమ్.. డిమాండ్ తగ్గలా

By:  Tupaki Desk   |   18 May 2018 5:17 AM GMT
ఎన్టీఆర్-త్రివిక్రమ్.. డిమాండ్ తగ్గలా
X
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ కాంబినేషన్ కుదిరిన టైమింగ్ మాత్రం జనాలకు నచ్చలేదు. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తీసిన తర్వాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌ తో జత కట్టడం నందమూరి అభిమానుల్ని నిరాశ పరిచింది. కెరీర్లో ఎన్నడూ లేనంత పేలవమైన సినిమా తీసిన త్రివిక్రమ్.. తన సత్తాపై సందేహాలు రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా విషయంలో అభిమానులు కొంత ఆందోళనతో ఉన్న మాట కూడా వాస్తవం. ఈ సినిమాకు ఆశించినంత బజ్ ఉంటుందా అన్న సందేహాలు రేకెత్తాయి. ఐతే ‘అజ్ఞాతవాసి’ ఫలితంతో సంబంధం లేకుండా ట్రేడ్ వర్గాల్లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు బాగానే డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర హక్కుల కోసం పోటీ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

షూటింగ్ ఇంకా ఆరంభ దశలో ఉండగానే ఈ చిత్ర యుఎస్ హక్కుల అమ్మకం పూర్తయినట్లు సమాచారం. ఐతే నిర్మాత ఎస్.రాధాకృష్ణ కేవలం ఈ ఒక్క చిత్ర హక్కుల్ని కాకుండా తన నిర్మాణంలో వస్తున్న నాగచైతన్య-మారుతిల ‘శైలజారెడ్డి అల్లుడు’.. శర్వానంద్-సుధీర్ వర్మల సినిమాను కూడా కలిపి మూడు చిత్రాలకు డీల్ ఫినిష్ చేశాడట. ఈ మూడు సినిమాలకు కలిపి రూ.18 కోట్లకు పలికాయట యుఎస్ హక్కులు. ఇందులో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వాటా మూడింట రెండొంతులు అంటున్నారు. అంటే రూ.12 కోట్లన్నమాట. ఇది తక్కువేమీ కాదు. ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన బయ్యర్లకు కొంతమేర నష్టాలు సెటిల్ చేయడంతో మరోసారి రాధాకృష్ణ మీద నమ్మకంతో బయ్యర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి మంచి రేట్లే పలికే అవకాశముంది.