Begin typing your search above and press return to search.

`నంది` వివాదంపై శంక‌ర్ షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   19 Nov 2017 10:51 AM GMT
`నంది` వివాదంపై శంక‌ర్ షాకింగ్ కామెంట్స్!
X

నంది అవార్డుల వివాదం టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌లో కూడా పెను దుమారం రేపుతోంది. కుల‌ - రాజ‌కీయ ప్రాతిప‌దిక‌న ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించార‌ని ప‌లువురు మీడియా సాక్షిగా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని వ‌ర్గాల వారితో ఓ మీడియా చానెల్ డిబేట్ నిర్వ‌హించింది. ఆ చ‌ర్చ‌లో పాల్గొన్న దర్శకుడు శంకర్ నంది అవార్డుల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ అవార్డుల ఎంపిక పూర్తి స్థాయి బాధ్య‌త జ్యూరీ క‌మిటీదేన‌ని - ప్ర‌భుత్వానికి - ముఖ్య‌మంత్రికి సంబంధం ఉండ‌ద‌ని అన్నారు. ప‌లు జ్యూరీ క‌మిటీలతోపాటు నంది అవార్డుల క‌మిటీకి చైర్మ‌న్ గా ప‌నిచేసిన అనుభ‌వంతో తాను ఈ విష‌యం చెబుతున్నాన‌ని అన్నారు. జ్యూరీ క‌మిటీలో సినీరంగంలో 24 క్రాఫ్ట్స్ లో అనుభ‌వం ఉన్న‌వారితో పాటు యువ‌కుల‌కు చోటు క‌ల్పించేవార‌ని చెప్పారు. క‌మిటీలో సినిమావారు 60 శాతం ఉంటే మిగిలిన రంగాల‌నుంచి 40 శాతం మంది ఉండేవార‌న్నారు. ఆ 40 శాతంలో సామాజిక కార్య‌క‌ర్త‌లు - సినీ విమ‌ర్శ‌కులు - ర‌చ‌యిత‌లు - మేధావులు ఉండేవార‌న్నారు. వారి ప్ర‌శ్న‌ల‌కు, ప్ర‌శంస‌ల‌కు విలువ ఉండేదన్నారు.

నంది అవార్డుల వివాదం విషయంలో ‘లెజెండ్’ సినిమా పైనే ఎక్కువ ప్రభావం ఉందని చెప్పారు. ‘‘బాలకృష్ణ గారు గ‌తంలో సింహాకు ఉత్త‌మ న‌టుడిగా నంది అవార్డు తీసుకున్నారు. లెజెండ్ కు ఆయ‌న‌కు అవార్డు ఇవ్వడంలో పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ సినిమాకే బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం కూడా అభ్యంతరం లేదు. కానీ, బెస్ట్ సినిమా అనేసరికి చాలా మంది అభ్యంతరం చెబుతున్నారు. అంటే ఆ సినిమాలో ఎక్కువ వైలెన్స్ ఉంది కదా.. మీరు చంపండి అని ప్రోత్సహిత్సారా? అని చాలామందికి కలిగే ప్రశ్న. అదొక్కటే తప్ప మిగతా ఏమీ నాకు భిన్నంగా కనపడలేదు.’’ అని శంకర్ చెప్పారు. ప్ర‌తి సంవ‌త్స‌రం నంది అవార్డుల విషయంలో కొంద‌రు ఫీల్ అవ‌డం స‌హ‌జ‌మ‌ని అన్నారు. అయితే, ఒక సంవత్స‌రం ప్ర‌క‌టించే అవార్డుల‌లో ఆ సంఖ్య త‌క్కువ‌గా ఉండేద‌ని, ఒక‌వేళ ఉన్నా అంద‌రూ మీడియా ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌న్నారు. మూడు సంవ‌త్స‌రాల‌కు క‌లిపి అవార్డులు ఇవ్వ‌డం వ‌ల్లే అసంతృప్తికి గురైన వారి సంఖ్య ఎక్కువగా ఉంద‌ని శంక‌ర్ అన్నారు. వారంద‌రూ ఒక్క‌సారిగా త‌మ ఆవేద‌న‌ను బ‌హిరంగంగా మీడియా ముందు వెళ్ల‌గ‌క్క‌డంతో ఈ వివాదం చినికిచినికి గాలి వానైంద‌ని అన్నారు.