రంగస్థలంతో సుక్కు పంట పండిందిగా..

Wed May 23 2018 20:20:37 GMT+0530 (IST)

టాలీవుడ్ లో అగ్ర దర్శకుల జాబితాలో సుకుమార్ పేరు చేరి చాలా కాలమే అయింది. కానీ అందుకు తగినట్లుగా ఆయనకు  పారితోషికం తీసుకునే అవకాశం మాత్రం ఇప్పటివరకూ చిక్కలేదు. ఇందుకు కారణం.. ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంలో వెనుకబడడమే. ఆ లోటును రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం మూవీతో తీర్చేసుకున్నాడు సుకుమార్.దీంతో ఇప్పుడు సుక్కు తర్వాతి ప్రాజెక్టుల విషయంలో ఫుల్లు క్రేజ్ ఏర్పడింది. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు.. మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధమైంది. వంశీ పైడిపల్లితో సినిమా అనంతరం ఈ ప్రాజెక్టుకును పట్టాలెక్కించనున్నాడు మహేష్. ఈ సినిమాకు సుకుమార్ భారీగా పారితోషికం ముట్టచెప్పేందుకు మైత్రీ సంస్థ సంతోషంగా అంగీకరించి అగ్రిమెంట్స్ చేసుకుందట. ఏకంగా 18 కోట్ల రూపాయలను ఇవ్వడంతో పాటు.. లాభాల్లో వాటాలను కూడా ఇవ్వాలన్నది ఈ అగ్రిమెంట్ అని తెలుస్తోంది.

రంగస్థలం మూవీ వరకు బహుశా సుక్కు లెక్క ఇందులో సగం వరకే ఉండొచ్చని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఇప్పుడు ఏకంగా 18 కోట్లతో పాటు లాభాల్లో వాటా అంటే.. అదేమీ చిన్న విషయం కాదు. రాజమౌళి తర్వాతి స్థానం దాదాపుగా సుకుమార్ కు దక్కినట్లే. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ లెక్కల ప్రకారం.. కొరటాల శివ కూడా దాదాపు ఇదే రేంజ్ లో అందుకుంటున్నాడు.