Begin typing your search above and press return to search.

మ‌హేశ్‌ బాబుకు ద‌త్త‌త చిక్కులు

By:  Tupaki Desk   |   27 Aug 2015 7:25 AM GMT
మ‌హేశ్‌ బాబుకు ద‌త్త‌త చిక్కులు
X
"మనకి అన్నీ ఇచ్చిన ఊరుకి తిరిగి ఏదైనా చేయాలి. సొంత ఊరుని దత్తత తీసుకుని అక్కడి అవసరాలను సమకూర్చాలి" ఇది శ్రీమంతుడు సినిమా పాయింట్. ఈ చిత్రం కథ, ఎమోషన్స్, మహేశ్‌ బాబు యాక్షన్ బాగా పండాయి. మ‌రోవైపు రియల్‌ లైఫ్‌ లో శ్రీమంతుడు ఎందరినో కదిలించింది. ఈ సినిమాను ఆదర్శంగా తీసుకుని ఎందరో పారిశ్రామివేత్తలు, ప్రజాప్రతినిధులు, ఎన్నారైలు, యువత సొంత ఊరిని, అనేక గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా మ‌హేశ్ బాబు కూడా తెలంగాణ‌లో మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ లోని ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు.

మ‌రోవైపు ద‌త్త‌త అంశంలో మ‌హేశ్‌ కు కొత్త‌ స‌మ‌స్య వచ్చిప‌డింద‌ని తెలుస్తోంది. శ్రీమంతుడి రాక కోసం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తోంది. రాజకుమారుడి.. పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ గ్రామ కూడలిలో పెద్దలు, మహిళలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పడెప్పుడు వస్తాడా.. మా నేలమీద ఎప్పుడు అడుగు పెడతాడా అని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

సూపర్‌ స్టార్ కృష్ణ భార్య, మహేశ్‌ బాబు తల్లి ఇంద్రాదేవి స్వగ్రామం ముసలిమడుగు. శ్రీ‌మంతుడు చిత్రం ద్వారా చ‌క్క‌టి సందేశాన్ని పంపిన మ‌హేశ్ బాబు తన అమ్మమ్మ దుర్గాంబ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటాడని ఇక్కడి గ్రామస్తులు మహేశ్‌ బాబు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంత‌గా ఎందుకు ఆప్యాయ‌త అంటే....మహేశ్‌ బాబు అమ్మమ్మ దుర్గాంబకు ముసలిమడుగుతో పాటు చుట్టుప్రక్కల ఊర్లలోను ఎంతో పేరుండేదని స్థానికులు చెప్తున్నారు. బీదవారికి, గ్రామస్తులకు ఆర్థికం సాయం, మాట సహాయం చేస్తూ పెద్ద దిక్కుగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం దుర్గాంబ కాలం చేసింది. ఆమెకు సంబంధించిన ఆస్తులు కూడా గ్రామంలో ఉన్నాయి. దుర్గాంబ నివసించిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో మౌలికసదుపాయాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు పాఠశాలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరి శ్రీమంతుడైన రాజకుమారుడు.. ముసలిమడుగు గ్రామస్తుల కలలను నిజం చేస్తాడా?