Begin typing your search above and press return to search.

మహేష్ తో కూడా మెసేజ్ ఖాయమే

By:  Tupaki Desk   |   26 Sep 2017 1:30 PM GMT
మహేష్ తో కూడా మెసేజ్ ఖాయమే
X
కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేసేందుకు ఎలాంటి స్టార్ హీరో అయినా ఇష్టపడతాడు. ఇందుకు కారణం.. ఓ సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కాగా లింక్ చేస్తూ.. మెసేజ్ ఓరియెంటెడ్ అనిపిస్తూనే.. ఫ్యాన్స్ ను ఆడియన్స్ ను ఉర్రూతలూగించే రేంజ్ లో సినిమా తీయడం మురుగ స్టైల్. ఇలాంటి అన్ని అంశాలను పర్ఫెక్ట్ గా.. ప్రతీ సినిమాలోనూ బ్లెండ్ చేయగలగడం అందరి తరం అయ్యే విషయం కాదు.

కానీ తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఇదే అంశాన్ని కొనసాగిస్తున్న మురుగదాస్.. రమణ(ఠాగూర్).. గజిని.. స్టాలిన్.. తుపాకి.. కత్తి(ఖైదీ నంబర్ 150)లాంటి చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు తొలిసారిగా తెలుగు తమిళ్ భాషల్లో స్పైడర్ అంటూ బై లింగ్యువల్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. తన చేతికి సూపర్ స్టార్ చిక్కాడు కదా అని.. తన స్టైల్ ను ఏ మాత్రం మార్చుకోలేదట ఈ దర్శకుడు. ఇప్పుడు స్పైడర్ లో కూడా మెసేజ్ తప్పనిసరిగా ఉంటుందని చెబుతూనే.. అందుకు తగిన హింట్ కూడా ఇచ్చేశాడు.

"ఇవాల్టి రోజుల్లో అందరూ తెగ హడావిడిపడిపోతూ ఉంటారు. ఇన్ స్టంట్ కాఫీలు.. టు మినిట్ ఫుడ్స్ టైపులో ఉంది వ్యవహారం. ఆఖరికి దేవుడికి దండం కూడా ఆ హడావిడి మధ్యలోనే పెడతారు. పక్కనోడి గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండట్లేదు. మిగతా వారి సంగతేమో కానీ.. అమ్మా నాన్నా ఫ్రెండ్స్.. చుట్టాల విషయంలో కూడా ఇదే చేస్తున్నాం. మానవత్వం పాళ్లు తగ్గి అసహ్యాలు పెరుగుతున్నాయి. స్పీడ్ ఉన్నా హ్యుమానిటి మిస్ కాకూడదన్నదే నా పాయింట్" అని చెప్పాడు మురుగదాస్.