Begin typing your search above and press return to search.

ఆ సీన్ల‌ను తొల‌గించ‌బోతోన్న మురుగ‌దాస్?

By:  Tupaki Desk   |   9 Nov 2018 7:05 AM GMT
ఆ సీన్ల‌ను తొల‌గించ‌బోతోన్న మురుగ‌దాస్?
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ - త‌మిళ హీరో విజ‌య్ ల కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన స‌ర్కార్ చిత్రంపై వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర....దివంగత ముఖ్యమంత్రి జయలలితను పోలి ఉందంటూ ఏఐడీఎంకే ఆరోపిస్తోంది. జయలలిత అసలు పేరు కోమలవల్లి అని...వ‌ర‌ల‌క్ష్మి క‌ట్టుబొట్టు కూడా జయలలితని పోలి ఉన్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. జయలలిత ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలపై విమ‌ర్శ‌లు గుప్పించార‌ని - సినిమాలో ఆ అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు తొలగించ‌కుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న కొన్ని థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. కొన్ని చోట్ల ప్రదర్శనలు నిలిచిపోవడం .. థియేటర్ల ధ్వంసం .. మురుగదాస్ ఇంటి ద‌గ్గ‌రకు పోలీసులు రావ‌డం...వంటి గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో .. వరలక్ష్మీ శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు....వారు ఆరోపిస్తోన్న మ‌రికొన్ని అభ్యంత‌ర‌క‌రం స‌న్నివేశాల‌ను తొలగించాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని కూడా త‌న టీమ్ కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, శుక్ర‌వారం రాత్రి నుంచి ఆ అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాల‌ను తొల‌గించేందుకు డిస్ట్రిబ్యూట‌ర్లు - థియేటర్స్ ఓనర్స్ అసోసియేష‌న్ అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. కోమ‌ల‌వల్ల అనే ప‌దాన్ని మ్యూట్ చేయ‌డంతో పాటు కొన్ని స‌న్నివేశాల‌ను నేటి రాత్రి నుంచి తొల‌గించ‌బోతున్నామ‌ని చెన్నైలోని ఓ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. స‌న్నివేశాలు తొల‌గించిన కాపీ...శుక్ర‌వారం రాత్రికి థియేట‌ర్ల‌కు చేర‌కోబోతోంద‌ని తెలుస్తోంది.