Begin typing your search above and press return to search.

మహేష్ వాయిస్ వద్దనుకున్నా..

By:  Tupaki Desk   |   25 Sep 2017 11:04 AM GMT
మహేష్ వాయిస్ వద్దనుకున్నా..
X
పది రోజుల కిందట చెన్నైలో జరిగిన ‘స్పైడర్’ ఆడియో వేడుకలో మహేష్ బాబు ప్రసంగానికి ఫిదా అయిపోయారు తమిళ జనాలు. చెన్నైలో పుట్టి పెరిగాడు కాబట్టి అతడికి తమిళం రావడంలో ఆశ్చర్యం లేదు కానీ.. అతను మరీ అంత ఫ్లోతో.. ఏ తడబాటూ లేకుండా మాట్లాడతాడని ఊహించలేదు అక్కడి వాళ్లు. తెలుగులో పొడి పొడిగా మాట్లాడే మహేష్.. తమిళంలో అలా గలగలా మాట్లాడటం కూడా ఆశ్చర్యపరిచింది. ఐతే తమిళంలపై మహేష్ కు ఇంత పట్టున్నప్పటికీ.. అతడితో ‘స్పైడర్’ తమిళ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పించే విషయంలో మురుగదాస్ సందేహించాడట. ముందు అతడి పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్టుతో వాయిస్ ఇప్పించాలని చూశాడట.

ఒకరు ఇద్దరు కాదు.. ఐదారుగురు డబ్బింగ్ ఆర్టిస్టులతో మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పించి చూశాడట. కానీ వాళ్లెవ్వరి వాయిస్ కూడా మహేష్ బాబుకు సెట్టవ్వకపోవడంతో.. చివరికి తన పాత్రకు మహేషే డబ్బింగ్ చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపించిందట. అలా మహేష్ వాయిస్ తో టెస్ట్ చేసి చూడగా.. అతను చాలా బాగా డబ్బింగ్ చెప్పాడని.. తన అంచనాల్ని మించి మహేష్ తమిళ డైలాగులు పలికి ఆశ్చర్యపరిచాడని మురుగదాస్ తెలిపాడు. షూటింగ్ విషయంలో ఎంతో ఓపిగ్గా వ్యవహరించిన మహేష్.. డబ్బింగ్ దగ్గర కూడా అదే ఓపిక చూపించాడని.. 14 రోజుల పాటు డబ్బింగ్ చెప్పాడని.. ఆ సమయంలో తాను పక్కనే ఉండి డబ్బింగ్ పూర్తి చేయించానని మురుగదాస్ వెల్లడించాడు.