Begin typing your search above and press return to search.

మహేష్ సినిమా.. అక్షయ్‌తో కూడా

By:  Tupaki Desk   |   30 May 2016 4:25 AM GMT
మహేష్ సినిమా.. అక్షయ్‌తో కూడా
X
తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌ కు ఒక స్టయిల్ ఉంది. ఆయన ఒకే సబ్జెక్టుతో ద్విభాషా చిత్రాలు చేస్తుంటాడు. ఐతే ఆర్టిస్టుల్ని మాత్రం మార్చేస్తుంటాడు. ఏమాయ చేసావె.. ఎటో వెళ్లిపోయింది మనసు.. తాజాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాల్ని ఇలాగే తీశాడు. వేర్వేరు హీరోల్ని పెట్టి ఒకే ప్లేస్‌లో రెండు వేర్వేరు సన్నివేశాలు తీస్తుంటాడతను. మరో తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కూడా ఇదే ఫార్ములాను అనుసరించబోతున్నట్లు సమాచారం. మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో మురుగదాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ముంబయి బ్యాక్ డ్రాప్‌ లో సాగే ఈ చిత్రం జూన్ నెలాఖర్లో సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు మురుగదాస్. ఇంతకుముందు ‘తుపాకి’ సినిమాను హిందీలో అక్షయ్ హీరోగా ‘హాలిడే’ పేరుతో రీమేక్ చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు మురుగ. అప్పుడే అతడిపై అక్షయ్‌కు గురి కుదిరింది. మురుగ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో రెండో సినిమా రాబోతోంది. మహేష్‌తో చేయబోయే కథనే హిందీలో అక్షయ్ హీరోగా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రాన్ని మురుగ - అక్షయ్ కలిసి నిర్మించబోతుండటం విశేషం. మహేష్‌ తో సినిమా సెట్స్ మీదికి వెళ్లిన కొంత కాలానికే హిందీ వెర్షన్ కూడా మొదలవుతుందట. కాస్త ఆటు ఇటుగా రెండు వెర్షన్లూ ఒకేసారి రిలీజయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.