Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డిపై మురళీ మోహన్ ఘాటు వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 April 2018 8:59 AM GMT
శ్రీరెడ్డిపై మురళీ మోహన్ ఘాటు వ్యాఖ్యలు
X
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తూ.. అర్ధనగ్న నిరసనకు కూడా దిగిన శ్రీరెడ్డిపై సీనియర్ నటుడు.. తెలుగుదేశం ఎంపీ.. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి హిందూ ధర్మాన్ని మరిచి ఇలా చేయడం కరెక్ట్ కాదని.. ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. ‘మా’లో ప్రతి ఒక్కరికీ సభ్యత్వం ఇవ్వడం సాధ్యం కాదని ఆయనన్నారు.

జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉండటంతో అందరూ ‘మా’ వైపు చూస్తున్నారని.. ఇలా అందరికీ ఎలా సభ్యత్వం ఇస్తామని ఆయన ప్రశ్నించారు. శ్రీరెడ్డి ఎవరో.. ఎన్ని చిత్రాల్లో నటించిందో కూడా తెలియదని.. ఆమె ‘మా’లో సభ్యత్వానికి దరఖాస్తు చేసిందో లేదో కూడా తెలియదని ఆయన అన్నారు. ఒకవేళ సభ్యత్వం నిరాకరించినా ఇలా నడి రోడ్డులో బట్టలు విప్పడం దారుణమని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. అంతటితో ఆపకుండా మీడియాను పిలవడం.. డిబేట్లు పెట్టడం తనకు మనస్తాపం కలిగించిందని ఆయనన్నారు.

ఇలా నిరసన తెలపడం వల్ల శ్రీరెడ్డికి ఏం ఒరిగిందని ఆయన ప్రశ్నించారు. శ్రీరెడ్డి వల్లే చాలామందికి నష్టం వాటిల్లిందని.. శ్రీరెడ్డికి ఎదురైన కష్టాలు వ్యక్తిగతమని.. అవి బయటపెట్టడం వల్ల అవకాశాలు వచ్చాయా అని ఆయన అడిగారు. శ్రీరెడ్డి వివాదం పెద్దది కాదని.. ఇది కేవలం పానకంలో పుడక లాంటిదని.. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయ అభిప్రాయడపడ్డారు.