Begin typing your search above and press return to search.

అబ్దుల్ కలాం కన్నా ముమైత్ ఎక్కువా?

By:  Tupaki Desk   |   27 July 2017 11:32 AM GMT
అబ్దుల్ కలాం కన్నా ముమైత్ ఎక్కువా?
X
మాదక ద్రవ్యాల కేసుకు తెలుగు మీడియా ఇస్తున్న ప్రాధాన్యంపై మండిపడ్డాడు మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్. ఇవాళ దిగ్గజ శాస్త్రవేత్త.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి స్మారక మండపాన్ని ఆయన స్వస్థలం రామేశ్వరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తే.. దాన్ని తెలుగు మీడియా పట్టించుకోలేదని.. ఇక్కడి మీడియా వాళ్లందరి దృష్టి డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణ మీదే ఉందని.. ఇది దారుణమైన విషయమని ఆర్పీ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రస్తుత తరానికి మీడియా జనరల్ నాలెడ్జ్ ఏమాత్రం ఇవ్వట్లేదని.. వాళ్లకు ఎంతసేపూ సంచలన వార్తల్ని కవర్ చేయడమే పనైపోయిందని ఆర్పీ అన్నాడు. కలాం స్మారక మందిరాన్ని ఆరంభించిన సంగతే మన మీడియాలో కనిపించడం లేదని.. ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించడం చుట్టూనే వార్తలన్నీ తిరుగుతున్నాయని ఆర్పీ అన్నాడు.

డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియాలో వస్తున్న లీక్ వార్తలపై ఆర్పీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. విచారణ సందర్భంగా ఏం జరిగిందో బయటికి చెప్పొద్దని సెలబ్రెటీలకు చెబుతున్న సిట్ అధికారులు.. విచారణకు సంబంధించి మీడియాలో వస్తున్న రకరకాల వార్తలపై ఎందుకు హెచ్చరించడం లేదని ఆర్పీ ప్రశ్నించాడు. మీడియా సరైన సమాచారమే ఇస్తుంటే అధికారులు.. సిబ్బందిలో ఎవరో ఒకరు చట్ట విరుద్ధంగా మీడియాకు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నట్లే అని అది తప్పు అని ఆర్పీ అన్నాడు. ఒకవేళ మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తుంటే.. అది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే అని.. ఏ రకంగా చూసినా ఈ వార్తలు సరైనవి కాదని ఆర్పీ అన్నాడు.