మెగా బ్లాక్ బస్టర్ కాపీ కొట్టారా!

Mon Feb 18 2019 13:18:51 GMT+0530 (IST)

పరిశ్రమకు వచ్చి పదేళ్ళు దాటుతున్నా ఇంకా అవకాశాలను తన ఇంటి ముందు క్యు కట్టేలా చేసుకుంటున్న నయనతార కొత్త సినిమా మిస్టర్ లోకల్. వేలైక్కారాన్ తర్వాత రెండోసారి శివ కార్తికేయన్ తో కలిసి నటిస్తోంది. ఇతను మనకు పెద్దగా పరిచయం లేదు కాని అప్పుడెప్పుడో కీర్తి సురేష్ తో రెమోలో పోయిన వారం సమంతాతో సీమరాజాలో హీరోగా చేసింది ఇతనే. ఈ కాంబోలో వస్తోందే మిస్టర్ లోకల్. నిన్నే దీని ట్రైలర్ కూడా విడుదల చేసారు.ఎప్పుడో అన్ని బాషల్లోనూ వాడేసి అరిగిపోయిన ఫార్ములాను దీనికి తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లోకల్ గా ఉంటూ సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే మిడిల్ క్లాసు అబ్బాయ్. డబ్బున్న అహంకారంతో కంపనీ సిఈఓననే గర్వంతో మిడిసిపడే అమ్మాయి. తక్కువ స్థాయి వాళ్ళంటే గిట్టదు. ఓ సందర్భంలో హీరోతో సవాల్ పడాల్సి వస్తుంది. తన పొగరును అణచడంతో పాటు స్వంతం చేసుకునే టార్గెట్ పెట్టుకుంటాడు హీరో. ఇదే స్థూలంగా మిస్టర్ లోకల్ కథ

ఇదే పాయింట్ తో సుమారు ముప్పై ఏళ్ళ క్రితమే చిరంజీవి నగ్మా జంటగా ఘరానా మొగుడు వచ్చింది. అందులో కోటీశ్వరురాలైన నగ్మా పొగరు అణిచే కార్మికుడిగా చిరు నటనకు మొదటి 10 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది. దీని ఒరిజినల్ తమిళ్ మన్నన్ కూడా ఆ స్థాయిలో ఆడలేదు అప్పట్లో.

సరిగ్గా ఇలాంటి లైన్ మీదే మిస్టర్ లోకల్ రూపొందటం విశేషం. రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మిస్టర్ లోకల్ కి సంగీతం హిప్ హాప్ తమిజా. ధ్రువ-కృష్ణార్జున యుద్ధంతో మనకూ సుపరిచితుడు అయిన ఇతను దీనికి స్వరాలు సమకూరుస్తున్నాడు. మనకు నాని నేను లోకల్ లాగా కార్తికేయన్ కు ఈ మిస్టర్ లోకల్ పెద్ద బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.