Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేష‌న్‌ లో శాత‌క‌ర్ణి, ఖైదీ టిక్కెట్లు

By:  Tupaki Desk   |   12 Jan 2017 9:50 AM GMT
పోలీస్ స్టేష‌న్‌ లో శాత‌క‌ర్ణి, ఖైదీ టిక్కెట్లు
X
అగ్ర సినీ న‌టుల సినిమాలు అంటే టిక్కెట్లు థియేటర్లలో దొరకవు. గంటల తరబడి క్యూలో బారులు తీరినా.. కేవలం బుకింగ్ కౌంటర్‌ లో లభించేవి నామమాత్రమే. అందుకే.. పోలీసులే నేరుగా ప్రేక్షకులకు సినిమా చూపించే బాధ్యత బెజవాడ పోలీసులు భుజానెత్తుకున్నారు. కొత్త సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్లకు బదులు పోలీస్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. సినిమా హాళ్ల వద్ద పట్టుబడిన జేబుదొంగలు - బ్లాక్ టిక్కెట్ల విక్రేతలు - నేరగాళ్లతో మాత్రం కాదు.. తమ అభిమాన హీరో సినిమా సినిమా తొలిరోజు తొలి ఆట చూసేందుకు తరలివచ్చే అభిమానులతో అంటే అందులో అనుమానమే లేదు. ఇందుకు మొదటి వరుసలో సత్యనారాయణపురం పోలీస్టేషన్ - ఆ తర్వాత గవర్నర్‌ పేట స్టేషన్లతోపాటు - ఇక గట్టు చప్పుడు కాకుండా టాస్క్ ఫోర్స్. ఇక తర్వాత వరుసలో వన్‌ టౌన్ - కొత్తపేట పోలీస్టేషన్లు. మల్టీఫ్లెక్స్ థియేటర్లు వచ్చాక అవి కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. మాస్ ప్రేక్షకులే కాదు.. క్లాస్ క్రౌడ్‌ కు కూడా టిక్కెట్లు కావాలంటే ‘పోలీసు’లే దిక్కు.

అసలు విషయానికొస్తే.. భారీ బడ్జెట్‌ తో నిర్మించే పెద్ద హీరోల సినిమాల విడుదల సందర్భంగా ప్రతిసారీ అభిమాన సంఘాలకు ఆరోజు పెద్ద పండుగే. ఇక పండుగ సమయాల్లో పోటీ పడి రిలీజయ్యే సినిమాల విషయంలో వేరే చెప్పాల్సిన పనిలేదు. గతంలో బెన్‌ ఫిట్ షో ట్రెండ్ నడిచిన సమయంలో సినిమా రిలీజుకు ముందు రోజు నుంచే థియేటర్ల వద్ద హడావుడి ఉంటుంది. టిక్కెట్ల కోసమైతే సామాన్య ప్రేక్షకులు - కొందరు అభిమానులు క్యూలైన్లలో అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాసేవారు. రానురాను టిక్కెట్ల ఇక్కట్లు ఎక్కవయ్యాక.. గొడవలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చేది. క్యూలో కేవలం నామమాత్రంగా టిక్కెట్లు ఇచ్చేసి అంతలోనే బుకింగ్ క్లోజ్ చేసి హౌస్‌ ఫుల్ బోర్డు పెట్టేసేవారు. మిగిలిన టిక్కెట్లు మాత్రం అభిమాన సంఘాలు - పోలీస్టేషన్ల వద్ద దొరికేవి. ఇక స్టేషన్ల వద్ద గుంపులు గుంపులుగా జనం చేరడం ఆనవాయితీగా వచ్చేసింది. ఇప్పుడు తాజా పరిస్ధితి కూడా ఇంతే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల సందర్భంగా క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించిన ప్రేక్షకులకు మొండి చేయి మిగిలింది. కాని టిక్కెట్ల పందారం పోలీస్టేషన్ల నుంచే సాగింది.

ప్రతిరోజూ ప్రతి షోకు ఇన్ని టిక్కెట్లు చొప్పున ప్రతి థియేటర్ నుంచి పోలీస్టేషన్‌ కు అప్పగించాల్సిందే. అదేవిధంగా టాస్క్ ఫోర్స్‌ కు మరో కోటా ఇవ్వాల్సిందే. దీన్నిబట్టి స్టేషన్ హౌసాఫీసర్ చెప్పిన వారికి, ముందుగా కాగితంపై రాసి ఉంచుకున్న వారికి జనరల్ డ్యూటీ కానిస్టేబుళ్లు పంపకాలు చేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది పోలీసు, రాజకీయనేతలు, ఇతర వ్యాపారస్థులు, సన్నిహితులు, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, వారి స్నేహితులకు ఇలా ఒక్కరోజులో నగరంలో అన్ని థియేటర్లు కలిపి వేల సంఖ్యలోనే పోలీసుల కనుసన్నల్లో టిక్కెట్లు పందారం జరుగుతుంది. ఖైదీ నెంబర్ 150 విడుదల తొలిరోజు కూడా ఇదే పరిస్థితి. ఇక యువరత్న బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కోసం క్యూలైన్‌ లో కాకుండా పోలీస్టేషన్ల ద్వారా వేల సంఖ్యలో టిక్కెట్లు బుక్ అయిపోయాయని థియేటర్ల యాజమాన్యమే చెబుతోంది. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు కమిషనర్ ఆదేశాలతో యాంటీ గూండా స్వ్కాడ్ పోలీసులు థియేటర్ల బుకింగ్ కౌంటర్ల వద్ద నిలబడి మరీ టిక్కెట్లు పక్కదారి పట్టకుండా క్యూలైన్‌ లో నిలుచున్న ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అమ్మించి దళారులను నిలువరించారు. ఇప్పుడు కూడా అదేమాదిరిగా పోలీసు కమిషనర్ చర్యలు చేపట్టి ఉంటే బావుండేదని సగటు ప్రేక్షకుడు ఆశిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/