Begin typing your search above and press return to search.

అమెరికాలో టికెట్ల దోపిడీపై ఓ ప్రేక్షకుడి ఆక్రందన

By:  Tupaki Desk   |   22 April 2017 10:22 AM GMT
అమెరికాలో టికెట్ల దోపిడీపై ఓ ప్రేక్షకుడి ఆక్రందన
X
ఒకప్పుడు తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదలయ్యేవి. తర్వాత పొరుగు రాష్ట్రాలకు విస్తరించాయి. ఆపై దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ వెళ్లాయి. క్రమ క్రమంగా దేశం కూడా దాటిపోయాయి. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా ముందుగా అమెరికా లాంటి దేశాల్లో తెలుగు సినిమాలకు ప్రిమియర్ షోలు పడుతున్నాయి. మన సినిమాల్ని నేరుగా రిలీజ్ టైంలోనే థియేటర్లలో చూసుకునే అవకాశం దక్కడం అమెరికాలోని తెలుగు ప్రేక్షకులకు సంతోషం కలిగించే విషయమే. కానీ వాళ్లకేదో మహద్భాగ్యం కల్పిస్తున్నట్లుగా నిర్మాతలు టికెట్ల రేట్ల విషయంలో దోపిడీకి పాల్పడుతుండటమే అక్కడి జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పిస్తోంది.

పెద్ద సినిమాలకుండే డిమాండును బట్టి ప్రిమియర్ షోలతో పాటు రెగ్యులర్ షోలకు కూడా నిర్ణీత ధర కంటే చాలా ఎక్కువ వసూలు చేస్తుండటం అమెరికన్ తెలుగు ఆడియన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ విషయమై ఓ అభిమాని తీవ్ర ఆగ్రహంతో మీడియాకు మెయిల్ పంపాడు. అవతార్ లాంటి మెగా హాలీవుడ్ మూవీకే టికెట్ రేట్లు అమెరికాలో 5-10 డాలర్ల మధ్య మాత్రమే పెట్టారని.. కానీ తెలుగులో రిలీజయ్యే చిన్న సినిమాలకు కూడా కనీసం 10-12 డాలర్ల రేటు పెడుతున్నారని.. ఇక బాహుబలి లాంటి సినిమాల విషయానికి వస్తే దోపిడీ దారుణంగా ఉంటోందని అతను ఆక్రోశం వెల్లగక్కాడు. బాహుబలి.. అవతార్ కంటే పెద్ద సినిమానా అని అతను ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు 25 డాలర్ల దాకా ఉంటోందని.. బాహుబలి-2కి మరీ అన్యాయంగా 33-42 డాలర్ల మధ్య టికెట్ రేటు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆ అభిమాని ప్రశ్నించాడు. పీకే.. దంగల్ లాంటి హిందీ సినిమాలకు టికెట్ల రేటు 10-12 డాలర్లు మాత్రమే పెట్టడాన్ని అతను ప్రస్తావించాడు. టికెట్ల రేటును ఇష్టానుసారం పెంచేసి.. కలెక్షన్ల రికార్డుల గురించి గొప్పగా చెప్పుకోవడంలో గొప్పేముందని ప్రశ్నించాడు. బాహుబలి లాంటి సినిమాల వల్ల జనాలు బలి అవుతున్నారని.. ఆదాయం దండుకోవడానికి ఇలా రేట్లు పెంచేస్తూ.. జనాల కోసమే సినిమాలు తీస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం సరికాదని.. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఆ ప్రేక్షకుడు విజ్నప్తి చేశాడు. ఎంతో సమంజసంగా అనిపిస్తున్న ఈ అభిమాని అభ్యర్థనను తెలుగు నిర్మాతలు పట్టించుకుంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/