Begin typing your search above and press return to search.

బాలయ్య కొడుకు అసిస్టెంట్ డైరెక్టరా?

By:  Tupaki Desk   |   2 May 2016 10:06 AM GMT
బాలయ్య కొడుకు అసిస్టెంట్ డైరెక్టరా?
X
బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్న గురించి రోజుకో ఆసక్తికర వార్త బయటికి వస్తోంది. తన వందో సినిమాలో తన కొడుకు ఓ క్యామియో రోల్ చేస్తాడని గతంలో ప్రకటించిన బాలయ్య ఆ హామీని నిలబెట్టుకుంటూ మోక్షజ్నతో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’లో ఓ పాత్ర చేయిస్తున్నట్లు ఇప్పటికే ఆ సినిమా యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకు వశిష్ఠిపుత్ర పూలంవి పాత్రలో మోక్షజ్న నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో ఇంకో రకంగా కూడా మోక్షజ్న భాగం పంచుకోబోతున్నాడన్నది తాజా సమాచారం.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం విభాగంలోనూ మోక్షజ్న పని చేయబోతున్నాడట. క్రిష్ దగ్గర అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండబోతున్నాడట. హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందు సినిమాకు సంబంధించి అన్ని విభాగాలపైనా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో బాలయ్యే తన కొడుకుకి ఈ బాధ్యత అప్పగించినట్లు సమాచారం. క్రిష్ లాంటి మంచి దర్శకుడి దగ్గర పని చేస్తే ఆ అనుభవం చాలా ఉపయోగపడుతుందని బాలయ్య భావించాడట. బాలయ్య సైతం హీరో కావడానికి ముందు తన తండ్రి ఎన్టీఆర్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మోక్షజ్న కూడా అలాగే చేయబోతున్నాడట. మొత్తానికి బాలయ్య వందో సినిమాలో ఆయన తనయుడి పాత్ర కీలకంగానే ఉండబోతోందన్నమాట.