Begin typing your search above and press return to search.

శాతకర్ణి పుత్రుడిగా బాలయ్య కొడుకు

By:  Tupaki Desk   |   1 May 2016 9:23 AM GMT
శాతకర్ణి పుత్రుడిగా బాలయ్య కొడుకు
X
2017లో తన కొడుకు తెరంగేట్రం ఖాయమని ఇప్పటికే రెండు మూడుసార్లు ప్రకటించాడు నందమూరి బాలకృష్ణ. అలాగే తన వందో సినిమాలో తన కొడుకు ఓ పాత్ర చేసే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయన్నాడు. ఈ రెండు హామీల్ని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో నిలబెట్టుకోవడానికి ప్రణాళిక రచిస్తున్నాడట బాలయ్య. తన కొడుకు తెరంగేట్రాన్ని తన వందో సినిమాలోనే కానిచ్చేయాలని ఆయన భావిస్తున్నాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మోక్షజ్న కోసం ఓ పాత్ర కూడా సిద్ధమైందట. గౌతమీ పుత్ర శాతకర్ణి కొడుకు వశిష్ఠీపుత్ర పూలంవిగా మోక్షజ్న నటించబోతున్నట్లు సమాచారం.

అంటే బాలయ్య కొడుకు తెరమీద కూడా బాలయ్య కొడుకుగానే కనిపించబోతున్నాడన్నమాట. ఐతే సినిమాలో ఆ పాత్రకు పెద్దగా లెంగ్త్ ఏమీ ఉండదని.. ఊరికే ఫార్మల్ గా మోక్షజ్నను పరిచయం చేయడానికి మాత్రమే బాలయ్య నిర్ణయించుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. శాతకర్ణి తర్వాత పూలంవినే శాతవాహన సామ్రాజ్య వారసత్వాన్ని అందుకున్నాడు. సినిమా చివర్లో ఈ పాత్రను పరిచయం చేస్తే.. తర్వాత మోక్షజ్న ప్రధాన పాత్రలో సీక్వెల్ తీసుకోవడానికి కూడా వీలుంటుందని భావిస్తున్నారట. మరి బాలయ్య భార్యగా.. మోక్షజ్న తల్లిగా నటించే హీరోయిన్ ఎవరో చూడాలి. ఆ పాత్ర పేరు నయనిక. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లబోతోంది.