Begin typing your search above and press return to search.

మోహన్ బాబుకు కొత్త బిరుదు

By:  Tupaki Desk   |   18 Jan 2018 7:14 AM GMT
మోహన్ బాబుకు కొత్త బిరుదు
X
42 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్ లో 500కు పైగా సినిమాలు చేయటం చిన్న విషయం కాదు. హీరో, విలన్, కమెడియన్, సపోర్టింగ్ రోల్ ఇలా అన్ని రకాల పాత్రలు పోషించి స్వర్గీయ నందమూరి తారక రామారావుతో మొదలుకుని ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ దాకా ఎందరో హీరోల సినిమాల్లో మరపురాని పాత్రలు పోషించిన మోహన్ బాబుని కలెక్షన్ కింగ్ అని ఊరికే అనలేదు. 1990లో చిరంజీవి కొదమసింహం సినిమాలో సుడిగాలి అనే కామెడీ విలన్ వేషం వేస్తూనే మరోపక్క అల్లుడుగారు సినిమాలో సోలో హీరోగా సీరియస్ ఛాయలు ఉన్న పాత్ర పోషించి రెండు రకాలుగా మెప్పించడం ఆయనకే చెల్లింది. అసెంబ్లీ రౌడీ - చిట్టెమ్మ మొగుడు - సోగ్గాడి పెళ్ళాం - మేజర్ చంద్రకాంత్ - పెద రాయుడు ఇలా మరిచిపోలేని సినిమాలెన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పటికీ అరిస్తే కరుస్తా లాంటి క్యాచీ డైలాగ్ జనం నోళ్ళలో నానుతుంది అంటే అది మోహన్ బాబుకు మాత్రమే సొంతమైన ప్రత్యేకత.

ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే మరో సరికొత్త బిరుదు మోహన్ బాబుని వరించింది. 42 వసంతాల నట ప్రస్థానానికి సూచికగా ఆయన కృషిని గుర్తించి టి.సుబ్బరామిరెడ్డి ఆయనకు ‘విశ్వనట సార్వభౌమ’ బిరుదు ఇచ్చి ఘనంగా సత్కరించారు. అన్న ఎన్టీఆర్ గారి బిరుదులో విఖ్యాత మాత్రమే ఇందులో లేకపోవడం గమనార్హం. నిన్న సాయత్రం నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప వాచకం ఉన్న నటుల్లో మోహన్ బాబుదే అగ్ర స్థానం అని అందరు కొనియాడారు.

ఇప్పటి దాకా కళాప్రపూర్ణ అనే అధికార బిరుదు - కలెక్షన్ కింగ్ అని అభిమానులు ఇచ్చిన బిరుదులతో పాటు ఇకపై విశ్వనట సార్వభౌమ అనే బిరుదు కూడా మోహన్ బాబు పేరు ముందు చేరనుంది. చాలా గ్యాప్ తర్వాత హీరోగా, విలన్ గా డ్యూయల్ రోల్ లో ఆయన నటిస్తున్న గాయత్రి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కొత్త బిరుదుతో ఆయన పేరు టైటిల్స్ లో వేసే మొదటి సినిమా ఇదే.