బిగ్ బాస్-2..నాని 'న్యాచురాలిటీ' కి పరీక్ష?

Wed Jun 13 2018 14:18:42 GMT+0530 (IST)

గత ఏడాది తెలుగులో తెరంగేట్రం చేసిన బిగ్ బాస్ సీజన్-1 గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అసలు తెలుగులో బిగ్ బాస్ కు ఆదరణ ఉండదేమో అనుకున్న స్థాయి నుంచి బిగ్ బాస్-2 కోసం వీక్షకులు ఎదురుచూసేలా చేయడంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. బిగ్ బాస్ -1 అంత ఘనవిజయం సాధించడానికి హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ కారణమంటే అతిశయోక్తి కాదు. మొదటి సీజన్ లో పార్టిసిపెంట్లతో తారక్ మమేకమైన తీరు....వారిలో ఒకడిగా కలిసిపోయి షోను రక్తికట్టించిన విధానం విమర్శకులను కూడా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ హోస్టింగ్ కు తోడు .....సీజన్-1లో పార్టిసిపెంట్లు కూడా సెట్ అవడంతో తెలుగులో బిగ్ బాస్ అరంగేట్రం అదిరిపోయింది. అయితే సీజన్ -2 కు ఎన్టీఆర్ స్థానంలో న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా రాబోతున్నాడని తెలియడంతో ఈ సీజన్ కూడా హిట్ అవుతుందని అంతా భావించారు. అయితే గత ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ -2 షో అంత ఆసక్తికరంగా సాగడం లేదని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తరహాలో నాని వీక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడని టాక్ వస్తోంది.సాధారణంగా ఒకే షోను ఇద్దరు హీరోలు హోస్ట్ చేస్తే వారి మధ్య పోలిక ఉండడం సహజం. అదే తరహాలో ఎన్టీఆర్ - నానిలను అయితే వెండితెరపై న్యాచురల్ స్టార్ గా పేరున్న నాని బుల్లితెరపై కూడా అదే తరహాలో ఆకట్టుకుంటాడని భావించారు. నాని....పక్కింటి అబ్బాయిలా పార్టిసిపెంట్లతో కలిసిపోయి....ఎన్టీఆర్ ను మరపిస్తాడనుకున్నారు. అయితే పార్టిసిపెంట్లతో నాని మింగిల్ కాలేకపోతున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటిసారి ఓ రియాలిటీ షోకు హోస్ట్ చేయడం వల్లనో..లేదంటే మరే కారణం వల్లనో...నానిలో సహజత్వం లోపించిందని టాక్ వస్తోంది. హౌజ్ లో సభ్యులతో సరదాగా - సన్నిహితంగా ఉంటాడనుకున్న నాని.....కేవలం `హోస్ట్` లాగా వ్యవహరిస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాని తరహాలోనే తారక్ కూడా సో ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందిపడ్డాడని.....ఆ తర్వాత తన స్టార్ డమ్ ను పక్కన బెట్టేసి న్యాచురల్ గా షోలో ఇన్వాల్వ్ అయ్యాడని అనుకుంటున్నారు. మరి ముందు నుంచి `న్యాచురల్ ` బ్రాండ్ ఉన్న నాని అందుకు భిన్నంగా వ్యవహరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తొలి వారమే నాని యాంకరింగ్ ను జడ్జ్ చేయడం తొందరపాటవుతుందేమోనన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో `బిగ్ బాస్-2`ను నాని ఎంతవరకు రక్తి కట్టిస్తాడో వేచి చూడాలి మరి!