Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'మిఠాయి'

By:  Tupaki Desk   |   22 Feb 2019 10:07 AM GMT
మూవీ రివ్యూ: మిఠాయి
X
చిత్రం : 'మిఠాయి'

నటీనటులు: రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి - శ్వేతా వర్మ - అదితి మైకల్ - కమల్ కామరాజు - భూషణ్ కళ్యాణ్ - రవి వర్మ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: రవివర్మన్
నిర్మాత: ప్రభాత్ కుమార్
రచన - దర్శకత్వం: ప్రశాంత్ కుమార్

హైదరాబాద్ అర్బన్ నేటివిటీతో కొన్నేళ్లలో కొన్ని డార్క్ కామెడీస్ వచ్చాయి. అందులో కొన్ని చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ కోవలోనే ఇప్పుడు ‘మిఠాయి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైవిధ్యమైన ప్రోమోలతో ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వెంకట్ సాయి (రాహుల్ రామకృష్ణ) కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. అనుకోని కారణాలతో అతడి ఉద్యోగం ఊడుతుంది. ఇంకో మూడు రోజుల్లో పెళ్లి అనగా.. అతడి ఇంట్లో దొంగతనం జరిగి విలువైన వస్తువులు పోతాయి. దీంతో తన మిత్రుడు జానీ (ప్రియ దర్శి)తో కలిసి ఆ దొంగలెవరో పట్టుకునే పనిలో పడతాడు సాయి. ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చివరికి దొంగ దొరికి సాయి సమస్యలన్నీ తీరి.. అతడి పెళ్లి సజావుగా సాగిందా.. ఈ విషయాలు తెర మీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

ఈ మధ్య సినిమా ఎలా తీసినా.. ఆసక్తికరంగా ప్రోమోలు కట్ చేయడంలో మాత్రం కొందరు ఫిలిం మేకర్స్ మంచి నైపుణ్యం కనబరుస్తున్నారు. సినిమాలో కొంచెం కొత్తగా అనిపించే షాట్లు తీసుకుని.. ట్రైలర్ కట్ చేసి జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినిమాలో ఏదో ఉందన్న భ్రమ కల్పిస్తున్నారు. ఆ ఆలోచనతో థియేటర్లకు వెళ్లి తల బొప్పి కట్టించుకుంటున్నారు ప్రేక్షకులు. కొన్ని నెలల కిందట ‘వీర భోగ వసంత రాయలు’ అనే సినిమా ఒకటి వచ్చింది. దాని కాస్టింగ్.. ప్రోమోలు చూసి జనాలు ఏదో ఊహించుకున్నారు. కానీ థియేటర్లలోకి వెళ్లి కూర్చున్నాక ఏం చూస్తున్నామో అర్థం కాని అయోమయంలోనే రెండు గంటల సమయం గడిపేసి బయటికి వచ్చారు. ఆ చిత్ర దర్శకుడు మాత్రం దాన్ని ఒక కల్ట్ ఫిలిం లాగా చెప్పుకున్నాడు. ‘మిఠాయి’ కూడా ఇలాంటి సోకాల్డ్ ‘కల్ట్’ ఫిలిమే.

‘మిఠాయి’ చూస్తున్నంతసేపూ కలిగే సందేహం ఒకటే.. అసలు ఈ దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు.. అతడి టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అని. సాధారణంగా డార్క్ కామెడీస్ తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుంటారు. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చూసేవాళ్లకు ఈ జానర్ ఎక్కదు. ఐతే ‘ఎ’ సెంటర్ల వాళ్లు కూడా జుట్టు పీక్కుని తామేం చూస్తున్నామో అర్థం కాని అయోమయానికి గురయ్యేలా నడుస్తుంది ‘మిఠాయి’. ఈ సినిమా చూసిన వాళ్లను మీరేం చూశారో చెప్పండి అని అడిగితే.. ఒక క్రమ పద్ధతిలో చెప్పడం కూడా కష్టమే. అంత సిల్లీగా.. అర్థ రహితంగా సాగుతాయి ‘మిఠాయి’ కథాకథనాలు. ఏది పడితే అది రాసేసి.. ఎలా పడితే అలా తీసేసిన సినిమా ‘మిఠాయి’ అని మరో మాట లేకుండా చెప్పొచ్చు.

ఒక సీన్లో రాహుల్.. ప్రియదర్శి ఇద్దరూ ఒక ఇంట్లోకి చొరబడాలని చూస్తారు. కానీ అక్కడో కుక్క ఉంటుంది. ప్రియదర్శి వెంటనే చికెన్ ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడెందుకురా చికెన్ అంటే.. ఆ చికెన్ ముక్కలు కుక్కకు పడేసి దాన్ని డైవర్ట్ చేసి లోపలికి వెళ్లిపోదాం అంటాడు ప్రియదర్శి. ఇలాంటి కొన్ని సీన్లలో దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ ఆకట్టుకుంటుంది. బహుశా అలాంటి కొన్ని సీన్లు చెప్పి రాహుల్ రామకృష్ణ.. ప్రియదర్శిలను ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ ఒప్పించి ఉండొచ్చు. అలా కాకుండా మొత్తం కథ చెప్పి వాళ్లను సినిమాకు ఒప్పించాడా అంటే సందేహమే. అంత గందరగోళంగా.. సిల్లీగా అనిపిస్తుంది ‘మిఠాయి’ వ్యవహారమంతా.

సినిమా ఆరంభంలో కొన్ని సీన్లు కొంచెం కొత్తగా అనిపించి.. ఏదో వైవిధ్యమైన సినిమా చూడబోతున్న భావన కలిగిస్తాయి. కానీ పావు గంట తర్వాత మొదలవుతుంది మోత. ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాదు.. ఏ పాత్ర ఏమిటో తెలియదు.. పిచ్చి పిచ్చి సంభాషణలు.. అర్థం లేని మలుపులతో ప్రేక్షకుల్ని ఫుట్ బాల్ ఆడేసుకుంటుంది ‘మిఠాయి’. అందులోనూ ద్వితీయార్ధం అయితే మరీ దారుణం. ఒక దశా దిశా లేకుండా సాగే ‘మిఠాయి’.. ప్రేక్షకుల్లో ఏ కాస్త ఓపిక మిగిలి ఉన్నా దాన్ని హరించేస్తుంది. రాహుల్.. ప్రియదర్శి లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుల్ని పెట్టుకుని ఇంత అర్థరహితమైన కథాకథనాలతో సినిమా ఎలా తీయాలనిపించిందో దర్శకుడికే తెలియాలి. వాళ్లిద్దరి ప్రతిభ కూడా సినిమాకు ఏ రకంగానూ ఉపయోగపడలేదు.

నటీనటులు:

తమ వంతుగా రాహుల్.. ప్రియదర్శి బాగానే చేశారు. బహుశా ఈ సినిమాకు ప్రత్యేకంగా మాటలంటూ ఏమీ రాసినట్లు లేదు. రాహుల్.. ప్రియదర్శి సందర్భానుసారం ఏదో ఒకటి మాట్లాడేస్తూ సాగిపోయినట్లుగా అనిపిస్తుంది. వాళ్ల నేటివ్ పంచులు కొన్ని అలరిస్తాయి. ఐతే సినిమా విషయంలో వాళ్లిద్దరికీ అయినా ఏమైనా క్లారిటీ ఉందా అన్నది మాత్రం సందేహమే. సినిమాలో లేడీ క్యారెక్టర్లకు చెప్పుకోదగ్గ రోల్స్ లేవు. శ్వేతా వర్మ.. అదితి మైకల్ గురించి చెప్పడానికేమీ లేదు. రవివర్మ.. భూషణ్ కళ్యాణ్.. కమల్ కామరాజు.. అయోమయం నిండిన పాత్రల్లో ఏదో అలా నటించి వెళ్లిపోయారు.

సాంకేతిక వర్గం:

వివేక్ సాగర్ పాటలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఈ తరహా సినిమాలకు అవసరమైన ఔట్ పుట్ ఇచ్చాడతను. రవివర్మన్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సాధారణంగా అనిపిస్తాయి. దర్శకుడు ప్రశాంత్ కుమార్.. తానేదో కొత్త తరహా నరేషన్ ట్రై చేస్తున్నానని అనుకుని ఉండొచ్చు. కానీ అసలేమాత్రం కసరత్తు చేయని రైటింగ్ వల్ల.. టేకింగ్ విషయంలో గందరగోళం వల్ల ‘మిఠాయి’ భరించలేని విధంగా తయారైంది. దర్శకత్వ పరంగా చెప్పడానికి ఏమీ లేదు.

చివరగా: మిఠాయి.. ఈ టేస్ట్ భరించలేం

రేటింగ్-1/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre