Begin typing your search above and press return to search.

వర్ధమాన నటి.. బిక్షగత్తె అయింది

By:  Tupaki Desk   |   27 April 2016 8:18 AM GMT
వర్ధమాన నటి.. బిక్షగత్తె అయింది
X
బాలీవుడ్ లో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ‘ఫ్యాషన్’ సినిమా చూసిన వాళ్లందరికీ అందులో కంగనా రనౌత్ పాత్ర ఎంత షాకింగ్‌ గా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ప్రముఖ మోడల్ గా ఉండి.. ఆ తర్వాత వీధుల్లో అడుక్కునే స్థితికి చేరిన ఓ అమ్మాయి నిజ జీవిత కథ స్ఫూర్తితో కంగనా పాత్రను తీర్చిదిద్దాడు డైరెక్టర్ మాధుర్ భండార్కర్. ఇప్పుడు దాదాపు ఇలాంటి విడ్డూరమే బాలీవుడ్ లో చోటు చేసుకుంది. వెండితెరపై వెలిగిపోదామని వచ్చిన ఓ అమ్మాయి భిక్షగత్తెగా మారిన వైనం అందరినీ కలచి వేస్తోంది. ఆ అమ్మాయి పేరు మిథాలి శర్మ.

25 ఏళ్ల మిథాలిది ఢిల్లీ. ఐతే హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో ఇంటి నుంచి పారిపోయి ముంబయికి వచ్చేసింది. ఇక్కడ ఓ భోజ్ పురి సినిమాలో అవకాశం కూడా దక్కించుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఆమె తల్లిదండ్రులు తనను నటనకు దూరం చేసేశారు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన మిథాలి.. అదోలా తయారైంది. ఇల్లు వదిలి వచ్చేసి రోడ్ల మీద భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టింది.

ఐతే రోడ్డుపై కనిపించిన వాళ్లందరి మీద దాడి చేస్తుండటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల మీద కూడా ఆమె దాడి చేసింది. చివరికి ఆమెను ఎలాగోలా అదుపులోకి తీసుకున్నారు. ఆమె రెండు రోజులుగా అసలు భోజనమే చేయలేదని తెలిసి పోలీసులకు కూడా కన్నీళ్లొచ్చాయి. ప్రస్తుతం మిథాలికి మానసిక వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన తల్లిదండ్రులెవరో తెలుసుకుని వారికి ఆమెను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.