Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నటుడి పెళ్లిపై సెటైర్లే సెటైర్లు

By:  Tupaki Desk   |   22 April 2018 8:37 AM GMT
బాలీవుడ్ నటుడి పెళ్లిపై సెటైర్లే సెటైర్లు
X
మనసులు కలిస్తే వయసు తేడాను పట్టించుకోకుండా ఒక్కటైపోతుంటాయి కొన్ని జంటలు. తన వయసులో సగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తులు అప్పుడప్పుడూ కనిపిస్తుంటారు. సెలబ్రెటీల్లో ఇలాంటి వాళ్లు లేకపోలేదు. తాజాగా బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్.. ఇదే బాటలో నడిచాడు. 52 ఏళ్ల మిలింద్ 25 ఏళ్ల వయసున్న అంకిత కోన్వర్ అనే అమ్మాయితో కొంత కాలంగా ప్రేమలో ఉండటం.. ఆమెతో పెళ్లికి సిద్ధపడటం తెలిసిందే. ఈ జంటను చూసి చాలామంది అవాక్కయ్యారు.

ఐతే వాళ్లిద్దరూ ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవాలనుకోవడం వాళ్ల వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరూ ఏమీ అనలేరు. ఐతే తమ పెళ్లి వేడుకను వాళ్లు అంగరంగ వైభవంగా చేసుకుంటూ దానికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చూసేవాళ్లకు చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది. నెటిజన్లు ఈ ఫొటోలు చూసి ఆశ్చర్యపోతూ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

అలీ బాగ్‌ లో వీరి పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి.. కుప్పలు కుప్పలుగా ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చి పడ్డాయి. పెళ్లి సందర్భంగా ఈ జంట పట్టలేని ఆనందంలో మునిగి తేలారు. డాన్స్ చేస్తూ మంచి హ్యాపీ మూడ్లో కనిపించారు. ఐతే 52 ఏళ్ల వయసులో సగం కంటే తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లిచేసుకోవడమే విడ్డూరమంటే.. పడుచు వయసులో ఉన్నట్లుగా ఈ హంగామా ఏంటి అంటూ నెటిజన్లు మిలింద్ మీద సెటైర్లు వేస్తున్నారు. కానీ మిలింద్ అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. అంకితను మిలింద్ చెన్నైలో ఒక నైట్ క్లబ్బులో కలిశాడు. 2014లో వీరి పరిచయం జరిగింది. ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి వైపు అడుగులేశారు.