Begin typing your search above and press return to search.

6 రోజులు.. 3 ఆడియోలు.. ఒక మిక్కీ

By:  Tupaki Desk   |   30 April 2016 3:30 PM GMT
6 రోజులు.. 3 ఆడియోలు.. ఒక మిక్కీ
X
దశాబ్దం కిందట్నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు మిక్కీ జే మేయర్. తొలి సినిమా ‘టెన్త్ క్లాస్’తోనే అతడి టాలెంటేంటో అందరికీ అర్థమైంది. ‘హ్యాపీ డేస్’ లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తో తన స్థాయి ఏంటో చాటిచెప్పాడు మిక్కీ. కానీ ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయినా.. మిక్కీకి స్టార్లతో పని చేసే అవకాశం దక్కలేదు. అతడి మ్యూజిక్ లోని ‘క్లాస్’ టచ్ అందుకు ఒక కారణం కావచ్చు. మాస్ సినిమాలకు పని చేసే సత్తా మిక్కీలో లేదని భావించి.. అతడికి అవకాశాలు ఇవ్వలేదు హీరోలు.. దర్శకులు. ఐతే ఈ మధ్య తాను అన్ని రకాల సినిమాలూ చేయగలనని చాటుకున్నాడు మిక్కీ. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో మాస్ ను అలరించే మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. మరోవైపు పెద్ద హీరోలందరూ మాస్ సినిమాల హద్దుల్లోంచి బయటకు వచ్చి క్లాస్ సినిమాలు చేస్తుండటం కూడా మిక్కీకి కలిసొచ్చింది.

దీంతో మిక్కీ పెద్ద సినిమాలకు కూడా మంచి ఛాయిసే అవుతున్నాడు. ఓ పక్క త్రివిక్రమ్ సినిమా ‘అ.. ఆ’కు.. మరో పక్క మహేష్ మూవీ ‘బ్రహ్మోత్సవం’కు అతనే సంగీత దర్శకుడు. మిక్కీ కెరీర్లో ఇవి చాలా పెద్ద అవకాశాలుగా భావించాలి. ఈ రెండు సినిమాల ఆడియోలు ఐదు రోజుల వ్యవధిలో జరగబోతుండటం విశేషం. వీటి వెంటే మిక్కీ సంగీతాన్నందించిన మరో సినిమా ఆడియో కూడా వచ్చే వారంలోనే విడుదల కాబోతుండటం గమనార్హం. ముందు ‘అ..ఆ’ ఆడియో మే 2న రిలీజవబోతుండగా.. 7వ తారీఖున ‘బ్రహ్మోత్సవం’ ఆడియో రిలీజ్ పెట్టుకున్నారు. ఆ మరుసటి రోజే సందీప్ కిషన్-నిత్యామీనన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ ఆడియో ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆరు రోజుల వ్యవధిలో 3 సినిమాలతో రచ్చ చేయబోతున్నాడన్నమాట మిక్కీ.