Begin typing your search above and press return to search.

కంగనా సినిమా వివాదం షురూ!

By:  Tupaki Desk   |   20 April 2019 9:48 AM GMT
కంగనా సినిమా వివాదం షురూ!
X
కర్ణుడికి కవచ కుండలాలు ఉంటాయని అంటారు కదా. అలాగే కంగనా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ వివాదాలు ఉంటాయి. కంగనా స్వయంగా ఏదో ఒక వ్యాఖ్య చేసి కొన్ని వివాదాలకు కేంద్రబిందువు అవుతుంది. కొన్ని సార్లు ఊరికే ఉబుసుపోక అలియా భట్ ను ఆడిపోసుకుంటుంది. ఏ టాపిక్ దొరక్కపోతే రాజాధిరాజ రాజ మార్తాండ బాలీవుడ్ నెపోటిజం పితామహ కరణ్ జోహార్ పై రెండు చెణుకులు విసురుతుంది. అయితే అదేం చిత్రమో కానీ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వివాదంతో కంగనా కు ప్రత్యక్షంగా లింక్ లేదు.. పరోక్షంగానే లింక్ ఉంది.

కంగనా తాజా చిత్రం 'మెంటల్ హై క్యా' జూన్ 21 న రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ రీసెంట్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ పిచ్చెక్కించేలా ఉంది. కంగనా.. హీరో రాజ్ కుమార్ రావ్ లు ఒకరికొకరు ఎదురుగా నిలబడి తమ నాలుకలపై ఒకే బ్లేడ్ ను నిలబెట్టారు. కంగనా పొట్టిగా ఉన్న రింగుల జుత్తుతో యమా రఫ్ గా ఉంది. ఈ ఫస్ట్ లుక్ ఓ రకమైన సంచలనమే సృష్టించింది. ఆ సంచలనంతో పాటుగా వివాదం కూడా నెలకొంది.

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీవారు ఈ పోస్టర్ పై.. 'మెంటల్ హై క్యా' సినిమాలోని కంటెంట్ పై అభ్యంతరాలు లేవనెత్తుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చాలా అంశాలు లేవనెత్తారు. అందులో మొదటిది.. ఈ సినిమా టైటిల్. ఈ మెంటల్ దిజార్డర్లు ఉన్నవారిని కించపరిచేలా ఉంది కాబట్టి టైటిల్ ను వెంటనే మార్చాలి. అంతే కాకుండా మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ప్రకారం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి మెంటల్ హెల్త్ కు సంబంధించిన విషయాలపై అవగాహన ఉండడం అనేది బాధ్యత కాబట్టి సెన్సార్ వారు సినిమాలో మెంటల్ డిజార్డర్ ఉన్నవారిని చులకన చేసేలా.. వారి గౌరవానికి భంగం కలిగేలా ఎలాంటి సీన్స్ ఉన్నా వాటిని తొలగించాలని కోరారు.

అయితే ఈ అభ్యంతరాలపై 'మెంటల్ హై క్యా' టీమ్ మెంబర్స్ ఎవరూ ఇంకా స్పందించలేదు. ముఖ్యంగా కంగనా ఇంకా తన నోరు తెరవలేదు.. ఆమె మాట్లాడితే ఏం ప్రళయం వస్తుందో ఇంకా తెలియదు. ఈ సినిమాకు దర్శకుడు కే రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కాగా బాలాజీ టెలీ ఫిలిమ్స్ బ్యానర్ పై ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు.