ఎక్స్ క్లూసివ్: నాకు జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ డిజాడర్ ఉంది

Thu Sep 28 2017 10:11:06 GMT+0530 (IST)

కాజల్ - శ్రుతిహాసన్ - సమంత - తరువాత టాలీవుడ్ లక్కీ బ్యూటీ స్టేటస్ కి మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ ఎవ్వరంటే ఇండస్ట్రీలో ఎక్కువుగా వినిపిస్తున్న పేరు మెహరిన్. కృష్ణగాడి వీరప్రేమగాధ తరువాత రెండే రోజుల్లో ఏకంగా ఆరు సినిమాలకు సైన్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఈ బబ్లీబ్యూటీ లేటెస్ట్ మూవీ మహానుభావుడు విడుదల నేపథ్యంలో చెప్పిన ముచ్చట్లు!* రెండు రోజుల్లో ఆరు సినిమాలు సైన్ చేశారట - ఏం మాయ చేశారు?

మాయ ఏం చేయలేదు - ఎలా రాసుంటే అలా జరుగుతుందటారుగా నా విషయంలో కూడా అదే జరిగింది. హిట్టు కొట్టిన ఏడాదిన్నర తరువాత ఆరు సినిమాలకి సైన్ చేశాను. ఆ గ్యాప్ లో నేను  పడ్డ టెన్షన్ కి ముచ్చటపడి ఆ దేవుడు నాకు వరుస అవకాశాలు వచ్చేలా చేశాడేమో. ఇదంతా ఓ డెస్టినీ  అని నేనే నమ్ముతున్నా. మాయ మాత్రం అస్సలు కాదు.

* హీరోయిన్లు మధ్య కాంపీటిషన్ ఎక్కువ - ఆ ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?

నేను ప్రతి క్వశ్చన్ కి ఒకటే సమాధానం ఇస్తున్నా అని అనుకోవద్దు(నవ్వులు). ఇది కూడా డెస్టినీ  అని అనుకుంటున్నా - ఎందుకంటే ఎవ్వరికి రాసి పెట్టిన పాత్ర వాళ్లకే దక్కుతుంది. సినిమాల్లో నటించే మేమే కాదు మమల్ని ఆదరించే ప్రేక్షకులు కూడా నటలే - ఇంకా చెప్పాలంటే లోకంలో ప్రతి మనిసి ఓ మహా నటుడే కదా ఇక టాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది కానీ అది నేను ప్రెజర్ గా ఫీల్ అవ్వను. ఎందుకుంటే ఇవాళ నన్ను దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాసుకున్న రైటర్ రేపు వేరే వారి కోసం కూడా కథలు రాస్తాడు. ఇవాళ నాకొచ్చిన ఆఫర్లు రేపు వేరే వారికి కూడా వస్తాయి. దేనికైనా టైమ్ రావాలి. నాకు ఇప్పుడు టైమ్ వచ్చింది.

* కృష్ణగాడి వీర ప్రేమగాధ తరువాత అంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి?

కృష్ణగాడి వీర ప్రేమగాధ హిట్ అయింది. నా పాత్రకు బాగా పేరొచ్చింది. ఆ సినిమా రిలీజ్ తరువాత ఎవరైన నన్ను గుర్తుపట్టి  మహాలక్ష్మీ(పాత్ర పేరు) అంటూ పిలుస్తుంటే భలే ఆనందం అనిపించేది. అయితే ఈ ఆనందం నన్ను వీడిపోవడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. హిట్ వచ్చాక కూడా సరైన అవకాశాలు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఆ సంవత్సరన్నర కాలం రుచి చూపించింది. కానీ నేను నమ్మకం కోల్పొకుండా ఓపికతో సరైన అవకాశం కోసం వెయిట్ చేశాను. ఇదిగో ఇప్పుడు ఇలా మీ ముందు కుర్చొని ఇంటర్ వ్యూ ఇస్తున్నా. అంతే సింపుల్.

* రీజన్ చెప్పకుండా బాగానే మ్యానేజ్ చేశారు?

(నవ్వులు) రీజన్ ఏం లేదు - టైమ్ బ్యాడ్ అంతే - ఇప్పుడు టైమ్ బాగుంది అవకాశాలు వస్తున్నాయి.

* మళ్లీ మళ్లీ సేమ్ ఆన్సర్ భలేగా ఇస్తున్నారు ఈసారైనా కొత్త ఆన్సర్ ఇవ్వండి?

(మళ్లీ నవ్వులు) మీరు అడిగే ప్రశ్నలు నన్ను ఒకే ఆన్సర్ ఇచ్చేలా చేస్తున్నాయి నన్నేం చేయమంటారు..!

* మహానుభావుడు ఎలా మీ దగ్గరకు వచ్చాడు?

ఒక్క మాటలో చెప్పాలంటే మహానుభావుడు నా లక్కీ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు సైన్ చేసిన తరువాత రోజే నాకు ఏకంగా అయిదు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత కూడా అవకాశాల వెల్లువ ఆగలేదు. దీంతో కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేక రెండు భారీ సినిమాలు నేను వదులుకోవాల్సి వచ్చింది. అయితేనేం ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు విడుదల తరువాత నా కెరీర్ మరింత షైన్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఇక మహానుభావుడు విషయానికొస్తే ఈ సినిమా స్టోరీ పక్కనపెడితే డైరెక్టర్ మారుతి - హీరో శర్వానంద్ కాంబినేషన్ అనే సరికి వెంటనే ఒకే చెప్పేశాను. ఆ తరువాత స్టోరీ విన్నా.

* స్టోరీ విన్నాక నచ్చకపోతే ఈ సినిమా నుంచి తప్పుకునే వారా?

కచ్ఛితంగా ఎందుకంటే ఈ సినిమాలో శర్వాకి అబ్సేసివ్ కంపల్షన్ డిజాడర్ (ఓసిడి) ఉన్నట్లే నాకు జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ డిజాడర్ ఉంది (నవ్వులు). నాకు కథ నచ్చకపోతే మహానుభావుడు కూడా వదులుకునే దాన్ని కానీ ఈ సినిమాలో నటించాలని ముందే రాసుంది. మారుతి కథ చెప్పిన వెంటనే నచ్చేసింది. హీరోకి క్యారెక్టర్ థీటుగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఉంటోంది. కొన్ని సన్నివేశాల్లో శర్వానంద్ నేను పోటీ పడి నటించాము.

* ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

ఏం లేవు - నేను నటించిన ఆరు సినిమాలు హిట్ అవ్వాలి. ముఖ్యంగా నా లక్కీ మూవీ మహానుభావుడు సక్సెస్ అవ్వాలి. అలానే నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శకనిర్మాతలు హ్యాపీగా ఉండాలి. అప్పుడేగా ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం నాకు వస్తుంది(నవ్వులు).