మాస్ దర్శకుడిపై మెగా ఫ్యాన్స్ కినుక

Sun Jan 13 2019 11:14:19 GMT+0530 (IST)

మాస్ సినిమాల్లోనే కాదు అసలు జానర్ ఏదైనా దేంట్లోనూ లాజిక్ ఉండదన్నది అక్షర సత్యం. ఈ మాట ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బోయపాటి శీను చెప్పాడు. అలా అని చెప్పి కమర్షియల్ సినిమాలో వాటిని పూర్తిగా గాలికి వదిలేయడం కూడా సమంజసం కాదు. ఫాంటసీ మూవీలో ఎలాంటి ప్రయోగమైనా అసంబద్ధ సన్నివేశమైనా అందులో ఎమోషన్ ఉంటే చాలు ప్రేక్షకులు ఒప్పుకుంటారు. అయితే వర్తమానంలో జరుగుతున్నట్టు చూపించే కథల్లో మాత్రం ఇలా ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. అయినా బోయపాటి ఈ ప్రాధమిక సూత్రాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాడు. కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు. కొన్ని దెబ్బలు తిన్నాడు. అయినా వినయ విధేయ రామ విషయంలో మళ్ళి రిపీట్ చేయడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ కు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తీయాల్సిన సినిమానే కాదని బోయపాటి మీద భగ్గుమంటున్నారు. అయితే ఓ వర్గం అభిమానులు మాత్రం కొత్త వెర్షన్ తో సోషల్ మీడియాలో ట్రాల్ చేస్తూ కొత్త అనుమానాలు రేపుతున్నారు. దాని ప్రకారం బోయపాటి కావాలనే వినయ విధేయ రామను ఇలా తీర్చిదిద్దాడట. ఎందుకంటే ఎన్టీఆర్ కథానాయకుడికి బలమైన పోటీగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనట.

బాలయ్యను విపరీతంగా అభిమానించే బోయపాటి ప్లాన్ ప్రకారమే ఇలా చేసాడని వాళ్ళ వెర్షన్. అయినా ఏ దర్శకుడు కావాలని తన కెరీర్లో మచ్చలా మిగిలిపోవాలి అనే సినిమా తీసుకోడు. దాని తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు. ఆ మధ్య మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం తీసాక శ్రీనివాస్ అడ్డాల ఇప్పటి దాకా బయట కనిపించలేదు. పరాజయం తాలూకు ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఇప్పుడు వివిఆర్ విషయంలో ఫాన్స్ చెబుతున్న వెర్షన్ అసంబద్ధంగానే ఉంది. తమ హీరో సినిమాకు ఇలాంటి టాక్ వచ్చిందా అనే బాధలో అలా మాట్లాడి ఉండవచ్చు కానీ దీన్ని నిజమని చెప్పేందుకు ఏ లాజిక్కు లేదు