పవన్ హీరోయిన్ కు బంపరాఫర్

Mon Mar 20 2017 15:33:14 GMT+0530 (IST)

మీరా చోప్రా గుర్తుందా..? పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ ‘బంగారం’లో కథానాయికగా నటించింది. అలాగే నితిన్ సరసన ‘మారో’ అని.. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘వాన’ అని.. నాగార్జునతో ‘గ్రీకు వీరుడు’ అని.. ఇలా ఆమె చేసినవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ సినిమాలే. దీంతో ఐరెన్ లెగ్ ముద్ర వేసి ఇండస్ట్రీ నుంచి సాగనంపేశారు టాలీవుడ్ జనాలు. తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో కూడా ఆమె ఒకటీ అరా సినిమాలు చేసింది కానీ.. అవేవీ సరైన ఫలితాన్నివ్వలేదు. మూణ్నాలుగేళ్లుగా అడ్రస్ లేని మీరా.. ఇప్పుడు ఉన్నట్లుండి వార్తల్లోకి వచ్చింది. ఆమె ఓ కెనడియన్ టీవీ సిరీస్ లో కీలక పాత్రకు ఎంపికవడం విశేషం.

దాదాపు ఏడాది నుంచి ఈ ఫాంటసీ టీవీ సిరీస్ కోసం ఆడిషన్లలో పాల్గొంటోందట మీరా. ఎట్టకేలకు ఆమెకు ఈ షోలో చోటు ఖాయమైంది. మీరా ఇందులో జ్యోతిషురాలి పాత్ర చేస్తోందట. ఈ సిరీస్ చేశాక తన దశ తిరిగిపోతుందని ఆశిస్తోంది మీరా. ఆమె కజిన్ అయిన ప్రియాంక చోప్రా.. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మరి ప్రియాంక సలహాతో ట్రై చేసిందో.. సొంత ప్రయత్నమో కానీ.. మీరా కెరీర్ కు ఇది ఊహించని మలుపే. ప్రియాంక లాగే ఈ టీవీ సిరీస్ లో మీరా కూడా రెచ్చిపోతుందేమో చూడాలి. చివరగా మీరా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ‘మొగిలిపువ్వు’ అనే సినిమా చేసింది. కానీ అది విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/