Begin typing your search above and press return to search.

ఐతే బేనర్ని బట్టే బూతులుంటాయన్నమాట

By:  Tupaki Desk   |   1 Sep 2015 7:40 AM GMT
ఐతే బేనర్ని బట్టే బూతులుంటాయన్నమాట
X
చిన్న సినిమాలతో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో చెప్పడానికి మారుతి సరైన ఉదాహరణ. ఈ రోజుల్లో లాంటి బుల్లి సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఆ తర్వాత బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి సినిమాలతో ఇంకా పెద్ద సంచలనాలకు తెర తీశాడు. ఐతే చిన్న సినిమాలకు పెద్ద స్థాయి తెచ్చిన దర్శకుడిగా ఎంత మంచి పేరు సంపాదించాడో.. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతో క్యాష్ చేసుకుంటాడని అంత చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడు. ఐతే ఇప్పుడా పేరు పోగొట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ‘కొత్తజంట’ నీట్ గానే తీశాడు. ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లాగే కనిపిస్తోంది.

ఐతే ఈ మార్పుకు కారణమేంటి? ఇకపై ‘బస్ స్టాప్’ తరహా సినిమాలు తీయరా అని మారుతిని అడిగితే.. ‘‘లేదు. తీయను. ఇకపై నా నుంచి క్లీన్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే వస్తాయి. చేస్తున్న బ్యానర్లు కూడా అలాంటివే. ఇప్పుడు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ వాళ్లతో చేస్తున్నారు. దిల్ రాజు గారి బ్యానర్ లో ఓ సినిమాకు కథ అందించా. గీతా ఆర్ట్స్ లో మళ్లీ ఓ సినిమా చేయబోతున్నా. ఈ సినిమాలన్నీ ఆ బేనర్ల పేరు నిలబెట్టేవే. భలే భలే మగాడివోయ్ కూడా అంతే. గీతా, యువి బేనర్ ల పేరు నిలబెడుతుంది’’ ని చెప్పాడు మారుతి. ఐతే మారుతి మాటల్ని బట్టి చూస్తుంటే.. బేనర్ ని బట్టి సినిమాను నీట్ గా తీయాలా లేదా అని ఫిక్సయ్యేలా కనిపిస్తున్నట్లున్నాడు. ఆ మాటకొస్తే ‘బస్ స్టాప్’ తీసిన బెల్లంకొండ బేనర్ ఏమైనా బూతు సినిమాలకు ప్రసిద్ధా? అని డౌటు కొడుతోంది. ఇంతకీ మారుతి దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది సరే.. ఆయన సమర్పణలో వచ్చే బి-గ్రేడ్ సినిమాల సంగతేంటో తెలియాలి. మారుతి సమర్పించాడంటే అది అదో టైపు సినిమా అని జనాలు ఫిక్సయిపోతున్నారు. ఏ ప్రయోజనాల కోసం మారుతి తన పేరును అరువిస్తున్నాడో కానీ.. దాని వల్ల అతడికొస్తున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇకనైనా ఈ సమర్పణలవీ మానుకుంటే బెటరేమో.